ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ నిఘా

Date:23/10/2018
కర్నూలు ముచ్చట్లు:
ఎన్ని భద్రత చర్యలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో ఇళ్లు చోరీలకు గురవుతుంటాయి. విలువైన వస్తువులను దొంగలు దోచేస్తుంటారు. కర్నూలు జిల్లాలోనూ ఈ సమస్య ఉంది. ఇటీవలిగా చోరులు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చేతివాటం ప్రదర్శించేస్తున్నారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏపనిమీదైనా ఇంటికి తాళం వేసుకుని ఊరికి వెళ్లాలన్నా.. బయటకు వెళ్దామన్నా టెన్షన్ పడుతున్నారు. ఎక్కడ దొంగలు తెగబడతారన్న భయమే దీనికి కారణం. శివారు కాలనీవాసుల్లో ఈ ఆందోళన అధికంగా ఉంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో పోలీసుల గస్తీ కొంత తక్కువగా ఉంది. దీంతో పలు గృహాల్లో చోరీలు జరిగాయి.
దొంగతనాలు అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండని పరిస్థితి. పోలీసుల కన్నుగప్పి దొంగలు ఏదో వైపు నుంచి విరుచుకుపడుతున్నారు. దీంతో దొంగతనాలు నివారించేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ అంటే లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టం. ఈ పద్ధతిని గతేడాది పోలీసు శాఖ అమలులోకి తెచ్చింది. అయితే ఈ విధానంపై చాలామందికి సరైన అవగాహన లేదు. దీంతో వారు లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టంను సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. ఫలితంగా తాళం వేసిన ఇళ్లపై దొంగలు విరుచుకుపడుతూనే ఉన్నారు.
దొంగతనాల నివారణకు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌పై పోలీసులే విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ ఇళ్లకు భద్రత కల్పించడంలో దోహదం చేస్తుంది. ప్రజలు తమ ఇంట్లో నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను స్మార్ట్ ఫోన్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారి పేర్లను ఇంటి చిరునామాతో సహా నమోదు చేసుకోవాలి. ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒకరోజు ముందుగానే ఇంటి యజమానులు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. యాప్‌ ద్వారానే వారికి రిక్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు సదరు గృహానికి వచ్చి కెమెరాలు బిగిస్తారు. అంతేకాక నిరంతరం నిఘా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇంటికి తాళం ఉంది కదా అని దొంగలు ఇంట్లో చొరబడేందుకు చూస్తే వెంటనే పోలీసు కంట్రోల్‌ రూంలోని అలారం మోగుతుంది. గస్తీ సిబ్బంది వెంటనే సదరు ఇంటికి చేరుకొని దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ పలు ప్రాంతాల్లో విజయవంతంగా పనిచేస్తోంది. దీని గురించిన తెలిసిన వారు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నిశ్చింతగా ఉంటున్నారు. జిల్లాలో ఈ యాప్‌లో దాదాపు 30వేల మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అవగాహనలేనివారు మాత్రం ఆందోళనతోనే ఉంటున్నారు. అందుకే ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై పోలీసులే విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తే ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుందని పలువురు అంటున్నారు.
Tags:LHMS App Intelligence

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *