కంటోన్మెంట్ లో ఆంక్షలు ఎత్తివేత

Date:21/05/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
సికింద్రబాద్ ప్రాంత ప్రజలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ  శుభవార్త ప్రకటించింది. భద్రత కారణాల దృష్ట్యా ఇన్నాళ్లు సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వకుండా కంటోన్మెంట్ రహదారులపై ఉన్న మిలిటరీ ఆంక్షలను రక్షణశాఖ ఎత్తివేసింది. కంటోన్మెంట్ ప్రాంతాల్లో.. సాధారణ ప్రజలకు, మిలిటరీకి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కంటోన్మెంట్ ప్రాంతాలకు చెందిన ఎంపీలు, కంటోన్మెంట్ బోర్డుల ఉపాధ్యక్షులతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ప్రధానంగా కంటోన్మెంట్ రహదారుల మూసివేతకు సంబంధించిన అంశాలపై ఈ మీటింగ్ జరిగింది. దీంతో ఈ అంశంపై నిర్మలాసీతారమన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్మిత్రా, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి కంటోన్మెంట్ రహదారులు తెరవాలని నిర్ణయించారు. తాజా నిర్ణయం మేరకు సికింద్రాబాద్ నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న 25 రోడ్లపై ఆంక్షలను ఎత్తివేయనున్నారు. దీంతో ఆయా ప్రాంతాలలో రాకపోకలను సాగిస్తున్న లక్షలాది మందికి ఉపశమనం కలుగనుంది. ఇంతకుముందు ఈ రోడ్లపై మిలిటరీ సిబ్బంది మోహరించి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కంటోన్మెంట్ రహదారులపై రాకపోకలను నియంత్రించేవారు. అయితే తాజాగా కంటోన్మెంట్లోని అన్ని రహదారులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags: Lift restrictions in cantonment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *