కేసీఆర్ అలా… కేటీఆర్ ఇలా

హైదరాబాద్ ముచ్చట్లు:


ఆరు నూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలు ఉండవని, ఆ అవసరమే లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు వేర్వేరు సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. మంత్రి కేటీఆర్ మాత్రం ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ జిల్లా పార్టీ నేతలను, శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. తండ్రీ కొడుకుల వేర్వేరు మాటలతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఏది ఏమైనా ఈసారి షెడ్యూలు కంటే ముందే ఎన్నికలు వస్తాయనే అనుమానం మాత్రం ఎక్కువగానే ఉన్నది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సైతం ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటూ హింట్ ఇచ్చారు. పార్టీ అధినేతగా కేసీఆర్ తెలంగాణ భవన్‌లో గతేడాది అక్టోబరు 17న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందు ముందస్తు ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 21న సైతం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ అంశాన్ని నొక్కిచెప్పారు. గత టర్ములో పలు సాగునీటి ప్రాజెక్టుల, అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతో మళ్లీ అధికారంలోకి వస్తేనే వాటిని పూర్తిచేయాలన్న ఉద్దేశంతో ముందస్తుకు వెళ్ళాల్సి వచ్చిందని, ఈ సారి అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. మునుపటి కన్నా ఎక్కువ స్థానాల్లో ఈసారి గెలవబోతున్నామని, 95 నుంచి 105 సీట్లు ఖాయమని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఇప్పటికే 30 సీట్లలో సర్వే చేస్తే ఒక్కదాంట్లో మాత్రం 0.3% తేడాతో ఓడిపోతున్నామని, మిగిలిన 29 చోట్ల గెలుస్తున్నామని ధైర్యాన్నినూరిపోశారు.కేటీఆర్ మాత్రం ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ”ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు..

 

 

ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి.. ఇంకా సమయం ఉంది గదా అని నిర్లక్ష్యం వద్దు..” అంటూ ఖమ్మం టూర్ సందర్భంగా శనివారం వ్యాఖ్యానించారు. దీనికి తోడు గెలిచేవారికే ఈసారి టికెట్లు ఉంటాయని, సిట్టింగ్‌లందరికీ అవకాశం ఉంటుందన్న భ్రమలు వద్దని కూడా క్లారిటీ ఇచ్చారు. సర్వేల్లో వచ్చే ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. గత వారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగానూ షెడ్యూలుకు ముందే ఎన్నికలు రావచ్చన్న సంకేతాలను ఇచ్చారు. ఒకే పార్టీకి చెందిన ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భిన్న రకాలుగా వ్యాఖ్యలు చేస్తుండడంతో పార్టీ కేడర్‌లో, ఇతర పార్టీల నాయకుల్లో మాత్రమే కాక ప్రజల్లోనూ ముందస్తు అనుమానాలు బలపడుతున్నాయి.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హడావిడిగా 80 వేలకు పైగా ఉద్యోగాల ప్రకటన చేయడం, అందులో సుమారు 30 వేలకుపైగా కొలువులకు సంబందించిన నోటిఫికేషన్లు జారీ కావడం, అన్ని జిల్లాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుండడం, దళితబంధు లాంటి పథకాలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లను జారీ చేయడం… ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని సంకేతాలివ్వడమేనని స్పష్టమవుతున్నది. అధికారుల స్థాయిలో సైతం ఇదే తరహా వాతావరణం నెలకొన్నది. దేశ, రాష్ట్ర స్థాయిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, విపక్ష పార్టీలతో పెరుగుతున్న రాజకీయ వైరం, అన్ని పార్టీల నేతలూ బహిరంగ సభల్లో, పాదయాత్రల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తుండటం,

 

 

 

ఎన్నికల ప్రచారం తరహాలోనే నేతల కామెంట్లు ఉండటం.. ఇవన్నీ ముందస్తు ఎన్నికలు అనివార్యమన్న సంకేతాలను ఇస్తున్నాయి.బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఎన్నికలు షెడ్యూలు కన్నా ముందే వస్తాయన్న అంచనాల్లో ఉన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలుగానీ, బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోడీ చేసిన రాజకీయ వ్యాఖ్యలుగానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహేశ్వరంలో చేసిన ప్రసంగంగానీ… ఎన్నికలకు సిద్ధం కావాలంటూ శ్రేణులకు ఇచ్చిన ఆదేశాలుగానే కనిపిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఐ-ప్యాక్ ద్వారా చేయిస్తున్న సర్వేలు, ప్రశాంత్ కిషోర్‌తో ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ జరుపుతున్న సమావేశాలు, పార్టీ సీనియర్లతో ప్రగతి భవన్‌లో జరుగుతున్న మీటింగులు.. ఇవన్నీ తెలంగాణలో తిరిగి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే. టీఆర్ఎస్ సంస్థాగతంగా బలహీనంగా ఉన్న ఖమ్మం జిల్లాలో శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూనే ఎన్నికలకు సిద్దం కావాలంటూ కేటీఆర్ పిలుపు ఇవ్వడం గమనార్హం.

 

Tags: Like KCR … Like KTR

Leave A Reply

Your email address will not be published.