స్థానిక ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం

Date:12/01/2019
పెద్దపల్లి ముచ్చట్లు:
 స్థానిక ఎన్నికలను పలు గ్రామాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్ గా ఎన్నికై తమ పల్లె అభివృద్ధికి పాటు పడాలని పలువురు ఆశావహులు బరిలోకి దిగారు. తమదైన ప్రచారం సాగిస్తున్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వ ప్రోత్సాహం వస్తుందన్న ఆశ, ఈ నగదు ప్రోత్సాహంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్న భావనతో పలువురు ఏకగ్రీవానికి యత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాల్లో రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న కామెంట్స్ పెద్దపల్లి జిల్లాలో వినిపిస్తున్నాయి. గ్రామాభివృద్ధి కంటే రాజకీయంగా పైచేయి సాధించాలన్న తపనే పలువురిలో ఉందని ఆశావహుల్లో కొందరు అంటున్నారు. ఇలాంటి వారు పోటీ నుంచి తప్పుకునేందుకు ఏమాత్రం అంగీకరించడంలేదు. ప్రధానంగా యువకులు బరిలో నిలిచి సర్పంచినా ఎన్నికై తమ గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. గతంలో కంటే ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవర్రంగా ఉంది. సర్పంచ్ పోస్ట్  తమకే దక్కాలనే పట్టుమీద ఉన్నారు ఆశావహులు.
పెద్దపల్లిలోనే కాదు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించాయి. దీంతో ఆయా పార్టీలకు చెందిన స్థానిక నేతలంతా గ్రామాలపై దృష్టి పెట్టారు. తమ అభ్యర్ధులను గెలిపించే వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల పరిధిలోని మండల, జిల్లాస్థాయి నేతలంతా గ్రామాల్లో ప్రచారానికి సిద్ధమైనట్లు చెప్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తతరం నాయకులతోపాటు పదవిని అనుభవించినవారు కూడా సర్పంచి పీఠం కైవసం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. పార్టీల తరపున టికెట్స్ ఆశిస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. వీరు తమకు టికెట్ దక్కితే సరేసరి లేదంటే తమ కుటుంబంలోని వారికి ఈ పదవిని కట్టబెట్టేలా ప్రయత్నాలు ఉధృతం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రామ పెద్ద కుర్చీ తమ చెంతనే ఉండాలని భావిస్తున్నారు. ఇక మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఈ తరహా రాజకీయం జోరుగా సాగుతోంది.
ఉమ్మడిజిల్లాలో 50 శాతానికిపైగా  మహిళలే పోటీ చేయనున్నారు. దీంతోఆశావహులతో పాటూ ఓ స్థాయి నేతలు గ్రామ సర్పంచి పదవులు తమకే దక్కేలా  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిచిన వారిలో కొంతమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పని మొదలుపెట్టారు. మండల, జిల్లా స్థాయిలో పేరుపొందినప్పటికీ సొంతూరిలో గెలిచి సర్పంచి పదవిలో సేవ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ పోస్ట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితోపాటు గతంలో మాజీలుగా మారిన నాయకులు, సహకార సంఘాల్లోని పదవుల్లో ఉన్నవారు, రైతు సమన్వయ సమితి పదవులు దక్కించుకున్నవారు.. ఇలా చాలామంది సర్పంచ్ పదవి కోసం ఆరాటపడుతున్నారు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సర్పంచ్ పోస్ట్ లకు డిమాండ్ భారీగా ఉంది. యువతతో పాటూ ఇప్పటికే వివిధ స్థాయిల్లో రాజకీయాధికారం చలాయించినవారూ సర్పంచ్ గా మారేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
Tags:Local elections are very prestigious

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *