గులాబీకి లోకల్ టెన్షన్

Date:21/02/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీఎల్‌ఎఫ్‌, ఇతర పార్టీలు 119 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెడితే ఆ పార్టీలకు ఎంత శాతం ఓట్లు పోల్‌ అవుతాయన్న విషయాలపై ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నది. కాంగ్రెస్‌కు కోదండరామ్‌ చేయిందిస్తే రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి. ఈ రెండు పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా వ్యూహాలపై పార్టీ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దృష్టి సారించారు. ఈ సర్వే ఆధారంగానే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలా? వద్దా? ఈ పార్టీలకు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల శాతం తగ్గకుండా ఎలాంటి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఇప్పటి నుంచే టీఆర్‌ఎస్‌ వ్యూహాలను రచిస్తున్నట్టు తెలిసింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) 119 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో దాని ప్రభావంపై కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. దీనిపై ఆ పార్టీ నేతలను, మంత్రులను అడిగినట్టు తెలిసింది. టీఆర్‌ఎస్‌పై కొత్త పార్టీ ఆ పార్టీ ప్రభావం ఎంత పడుతున్నదన్న దానిపై కూడా కేసీఆర్‌ సర్వే చేయిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తే బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేస్తారా? ఆ సామాజికవర్గాలను బీఎల్‌ఎఫ్‌ ప్రభావితం చేస్తుందా? మొత్తంగా ఆ ఫ్రంట్‌కు ఎంత శాతం ఓట్లు పోలౌతాయన్న అంశాలపై కూడా సర్వే చేస్తున్నట్టు తెలిసింది. ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగానే సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా సర్వే చేయిస్తున్నారు. ఒక్కోక్క నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల నుంచి 2.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఎమ్మెల్యేల పని తీరుపై ఒక్కో నియోజకవర్గంలో సుమారు 2,600 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. సర్వేలో ఎమ్మెల్యేలపై ఓటర్ల నుంచి ఏ మాత్రం వ్యతిరేకత వచ్చినా ఆ నియోజకవర్గంలో కొత్త వారికి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేల పని తీరు బాగా లేదని, వారి వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం జరిగిందన్న భావనలో టీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నారు. మచ్చపడ్డ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి టికెట్టు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. హద్దులు దాటుతున్న నేతలు, అక్కడక్కడ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలపైనా సర్వే నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అటువంటి నాయకులు పార్టీకి సహకరిస్తారా? లేక పార్టీకి నష్టం కలిగిస్తారా? అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ సర్వేలో పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు వెల్లడవుతే కొత్త నాయకత్వాన్ని ప్రకటించాలన్న ఆలోచనలో ఉంది. ఏది ఏమైనప్పటికీ టీఆర్‌ఎస్‌కు ఓటింగ్‌ శాతం తగ్గకుండా చూడాలన్న ఆలోచనలో ఆ పార్టీ అధినేత ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై కూడా సర్వే నిర్వహిస్తున్నది. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయా? వాటితో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఇంకా ఎలాంటి కొత్త పథకాలు చేపట్టాలన్న అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటి నుంచే పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం అంత సులువు కాదన్న అభిప్రాయంతోనే టీఆర్‌ఎస్‌ అధినేత ఈ సర్వేలు నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Tags: Local Tension for Rose

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *