లోకేష్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

What's behind Targeting the Lokesh?
Date:11/02/2019
విజయవాడ ముచ్చట్లు:
చంద్రబాబు రాజకీయాల్లో అనుభవజ్ఞుడు. నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. భవిష్యత్తును ఊహించి ఆయన అభివృద్ధి చేస్తారన్న పేరుంది. పరిపాలనలో ఆయనకు గట్టిపట్టుంది. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంవైపు పరుగులు తీయిస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే ఆయనను గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. అన్ని రాష్ట్రాల కంటే ఏమాత్రం తక్కువ కాకుండా ఏపీని ముందుంచుతారన్న విశ్వాసంతోనే పసుపు పార్టీకి గత ఎన్నికల్లో జై కొట్టారు.కాని ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి ఆయనపై ఏపీ ప్రజలకు ఇంకా నమ్మకం సడలకున్నా…. ఎమ్మెల్యేల అవినీతి, జన్మభూమి కమిటీల ఆగడాలు వంటివి పసుపు పార్టీ దళపతి మెడకు చుట్టుకుంటున్నాయి. వీటి నుంచి బయటపడటానికి చంద్రబాబు ఏపీలోని వివిధ వర్గాల ప్రజలపై గత నెల రోజులుగా వరాలు కురిపిస్తూ వెళుతున్నారు.
కానీ ఆయనకు ఉన్న ప్రధాన సమస్య తనయుడు లోకేష్ అని రాజకీయ విశ్లేషకుల అంచనా. దొడ్డిదారిన రాజకీయాల్లోకి తనయుడిని తీసుకొచ్చి అందలం ఎక్కించేందుకు బాబు తపన పడుతున్నారన్న ప్రత్యర్థుల విమర్శలకు చంద్రబాబు సయితం చెక్ పెట్టలేని పరిస్థితి.ఎప్పటి నుంచో జగన్ లోకేష‌ అవినీతి గురించి వివిధ సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. పాదయాత్ర సమయంలోనూ లోకేష్ టార్గెట్ గానే జగన్ ప్రసంగాలు సాగేవి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం గుంటూరు లో జరిగిన తొలి సభలోనే లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ అవినీతికి తన వద్ద ఆధారాలున్నాయని కూడా పవన్ చెప్పారు. ఇక తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సయితం లోకేష్ ను టార్గెట్ చేయడం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది.లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి నాటి నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఆయనపై విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓట్లను కూడా తొలగించే కార్యక్రమంలో లోకేష్ వెనుక ఉన్నారన్న ఆరోపణలు వైసీపీ బహిరంగంగానే చేసింది. తాజాగా ప్రధాని మోదీ కూడా లోకేష్ పేరును పదే పదే ప్రస్తావించి ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమే రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు తాకట్టు పెట్టారని ప్రధాని స్థాయిలో విమర్శలు చేశారంటే లోకేష్ ఇప్పుడు అందరి టార్గెట్ అయ్యారని చెప్పక తప్పదు. మరి లోకేష్ దీనికి సమాధానం చెప్పుకున్నా ఎన్నికల నాటికి ఆయనపై మరింత విమర్శల జోరు పెరిగే అవకాశముంది. ఇప్పుడు చంద్రబాబుకు లోకేష్ అసలు సమస్య అయి కూర్చున్నాడన్న టాక్  పార్టీలో ఇంటర్నల్ గా నడుస్తుంది.
Tags: lokayuk-around-politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *