Long time to join the elder brothers

అన్నదాతలకు కలిసిరాని కాలం 

Date:04/01/2019
ఖమ్మం ముచ్చట్లు:
ఈ ఏడు కూడా అన్నదాతలకు కాలం కలిసి రాలేదు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. ఖరీఫ్‌ వ్యవసాయ సీజన్‌ ఆశాజనకంగా ప్రారంభమైనప్పటికీ మధ్యలో వచ్చిన మార్పుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలకు చీడపీడలు ఆశించి నష్టం జరిగింది. జులై, ఆగస్టు నెలల మధ్య సుమారు నెల రోజులు వర్షాలు మొఖం చాటేశాయి.
బెట్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు వడబడ్డాయి. బ్యాంకులు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయక పోవటం వల్ల ఎప్పటి లాగే వారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రానురాను పెట్టుబడులు భారమై దిగుబడులు తగ్గటం వల్ల అన్నదాతలు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. చాలా మంది కాడి వదిలేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి ఇక మరీ దారుణంగా ఉంది. పంటలు దెబ్బతినటం వల్ల అప్పులు ఊబిలో కూరుకుపోయారు.
అసలే ఈ సంవత్సరం కౌలు ధరలు పెరిగాయి. పంటలైనా ఆదుకుంటాయని భావించి అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు అప్పుల బారి నుంచి బయటపడే అవకాశం కన్పించటం లేదు. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 30వేలకు పైగానే కౌలు రైతులు ఉన్నారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా సుమారు 4లక్షల ఎకరాల్లో పత్తి పంట ఎదుగుదల తగ్గింది. దీని ప్రభావం దిగుబడిపై పడింది. ఎకరానికి రూ.32వేల వరకు పెట్టుబడి పెట్టారు. అనావృష్టి పరిస్థితుల వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. దీనికి తోడు ఆగస్టు 20 నుంచి సెప్టెంబరు 15వరకు ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల అతివృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. అధిక వర్షాల వల్ల ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి.
దిగుబడి కూడా సాధారణం కంటే తక్కువగా వచ్చింది. ఈసారి పత్తి ఎకరానికి 10క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనుకుంటే కేవలం రెండు, మూడు క్వింటాళ్లకు మించి రాలేదు. ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడిలేక పోవటం వల్ల రైతులకు కనీస పెట్టుబడులు కూడా రాలేదు. పలు ప్రాంతాల్లో పత్తికి గులాబి రంగు పురుగు ఆశించి నష్టం చేసింది. రబీ పంటలు సాగు చేసేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపటం లేరు. ఇప్పటి వరకు కేవలం 40శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగు చేశారు.
ఖరీఫ్‌లో జరిగిన నష్టం నుంచి కోలుకోలేని రైతులు రబీకి సిద్ధం కాలేకపోతున్నారు.మిరప రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్మగోచరంగా ఉంది. రెండు జిల్లాల్లో కలిపి సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.1.30లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అక్టోబరులో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వల్ల దాని ప్రభావం మిరప పంటపై పడింది. 32నుంచి 34 డిగ్రీల వరకు కూడా కొన్ని రోజుల వరకు ఉష్ణాగ్రతలు ఉన్నాయి. జెమినీ వైరస్‌తో పాటు అన్ని రకాల వైరస్‌లు ఈసారి దాడి చేశాయి. చాలా ప్రాంతాల్లో రైతులు తోటలు పీకేశారు.
ఇప్పుడు మిరపకు ధర అశాజనకంగా రూ.10వేల పైనే ఉంది. దిగుబడి వస్తే కష్టాలు తీరతాయని భావించిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఎకరానికి 20నుంచి 22క్వింటాళ్ల వరకు రావాల్సిన పంట ఏడెనిమిది క్వింటాళ్లకు మించి వచ్చే అవకాశం లేదు. ఈ పంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఈసారి కూడా అప్పులే మిగిలాయి.అన్ని పంటలకు పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎరువులు, పురుగు మందుల ధరలు 40శాతం పెరిగాయి. మంచి వ్యవసాయ సీజన్‌లోనే పెట్రోలు, డీజిలు ధరలు పెరిగాయి. అనివార్యంగా ఈభారం సేద్యంపై పడింది. పెట్టుబడి పెరిగినా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు.
దీని వల్ల వ్యవసాయం కుంటుపడుతోంది. వ్యవసాయశాఖ ప్రతి సంవత్సరం సన్న, చిన్నకారు రైతులకు యంత్ర పరికరాలు సరఫరా చేసే వారు. ఈసంవత్సరం తైవాన్‌ స్పేయ్రర్లు కానీ, చేతి స్ప్రేయర్లు, ఇతర చిన్న చిన్న పరికరాలు సరఫరా చేయలేదు.వాణిజ్య పంటలకు పెట్టుబడి ఎక్కువవుతున్నందున అనేక మంది సన్న, చిన్నకారు రైతులు గత మూడేళ్ల నుంచి రెండు జిల్లాల్లో మొక్కజొన్న సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సుమారు 40వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కత్తెర పురుగు ఆశించింది.
మొక్క దశలోనే తీవ్ర నష్టం జరిగింది. వ్యవసాయశాస్త్రవేత్తల బృందం జిల్లా వ్యాప్తంగా పర్యటించి మొక్కజొన్నలో కత్తెర పురుగును పరిశీలించింది. నివారణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించింది. అయినప్పటికీ చాలా నష్టం జరిగింది. పెట్టుబడిలో సగం కూడా రాకపోవటంతో అన్నదాతలు నిలువునా మునిగారు. గత 15 నుంచి 20సంవత్సరాల్లో మొక్కజొన్నకు ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరగటం ఇదే ప్రథమం. కత్తెర పురుగుకు భయపడి రైతులు రబీలో సాగుచేయటం పూర్తిగా తగ్గించారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖలో పెద్ద ఎత్తున వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లను వ్యవసాయ అధికారులు(ఏవోలను) నియమించింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ వీరు రైతులకు అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ పథకాలను వారికి అందించేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 120 వ్యవసాయ విస్తరణ అధికారులు, 24 వ్యవసాయశాఖ అధికారుల పోస్టులను భర్తీ చేయటం ద్వారా ఈశాఖను మరింత పటిష్టం చేశారు.
వరి సాగు పరిస్థితి ఆశాజనకంగా లేదు. సుమారు 1.25లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.26నుంచి రూ.28వేల వరకు పెట్టుబడి పెట్టారు. దోమపోటు, సుడిదోమ ఆశించి నష్టం చేసింది. రైతులు నాలుగైదు సార్లు మందులు పిచికారీ చేసినా ప్రయోజనం కన్పించలేదు. దిగుబడులు ఆశాజనకంగా లేవు.
ఎకరానికి సాధారణ దిగుబడి 25బస్తాలు రావాల్సి ఉండగా 18నుంచి 20బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. రబీలో సాగర్‌ ఎడకాల్వ పరిధిలో వరి వేసే పరిస్థితి లేదు. ఇప్పటికే వారబందీ పద్ధతిలో జలాలు విడుదల చేస్తామని చెప్పటం వల్ల రైతులు మెట్టపంటలపై ఆధారపడుతున్నారు.
Tags: Long time to join the elder brothers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *