ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై కేంద్రం చిన్నచూపు!

Date:14/03/2018
అమరావతి ముచ్చట్లు:
ప్రత్యేక హోదా పొందుతున్న ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా అన్నీ ఇస్తామంటూనే ఆంధ్రప్రదేశ్‌పై మాత్రం వివక్షతో వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సమానంగా ప్రయోజనం కలిగే నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా విదేశీ రుణాలతో చేపట్టే ప్రాజెక్టుల రుణాల్లో 90% గ్రాంట్‌, పన్ను రాయితీలు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90% నిధులు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్తోంది. హోదా ఉన్న రాష్ట్రాలకు ఈఏపీ రుణాల్లో 90% కేంద్రమే భరిస్తున్నట్లు సాక్షాత్తు పార్లమెంటు ముందు ఎన్డీయే సర్కార్ అంగీకరించింది. అయితే అది హోదా కిందికి రాదని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పన్ను రాయితీల కింద 8 ఈశాన్య రాష్ట్రాలకు చేయూతనిస్తోంది. 2000 ఏప్రిల్‌ 1నుంచి 2017 మార్చి 31 వరకు రూ.3,847 కోట్ల విలువైన రాయితీలు కల్పించినట్లు గణాంకాలు ఉన్నాయి. అంటే  17 ఏళ్లకాలంలో ఒక్కో రాష్ట్రానికి సగటున రూ.480 కోట్ల ప్రయోజనం కలిగిందన్న మాట.జీఎస్టీ రిఫండ్‌ కింద 2018-19 మూడు హిమాలయ, 8 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి రూ.1,500 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌కు ఇవే పన్ను రాయితీలు కల్పించినా ఏటా రూ.500 కోట్లకు మించి ఉపయోగించుకొనే పరిస్థితి ఉండేది కాదని నిపుణుల విశ్లేషణ. ఈ స్వల్ప సాయం చేయడానికి కూడా కేంద్రం వెనుకాడింది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు తీసిపోకుండా ఆంధ్రప్రదేశ్ కూ నిధులు ఇస్తామన్న కేంద్రం మాట నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. రాష్ట్రానికి నిధులు ఇవ్వండని వేడుకునే కొద్దీ మోడీ నాయకత్వం మొండికేస్తున్న పరిస్థితి. నవ్యాంధ్రే గనుక ఉత్తర భారత్ లో ఉంటే నిధులు భారీగానే లభించి ఉండేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బడిముబ్బడిగా నిధులు అందించి ఉండేదని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిన ఉండడంతో షరా మామూలుగానే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు..
Tags: Look at the Center for the benefits of Andhra Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *