నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూపులు

Date:13/06/2019

అదిలాబాద్ ముచ్చట్లు:

రెండో సారి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా పార్లమెంట్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు వరుసగా రావడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ఉత్తమమని ఆధినేత కెసిఆర్ భావించారు. ఎన్నికల ప్రక్రియ దాదాపుగా పూర్తి అయింది.  కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే ఉండడంతో దశల వారీగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో రిజర్వేషన్లు అనుకూలించక పోవడం, పోటీ తీవ్రత దృష్టా బరిలో నిలబడకుండా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన వారంతా నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని ఎంఎల్ఎల వద్ద ప్రస్తావించి ఎలాగైన నామినేటెడ్ పోస్టు ఇప్పించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఎలాంటి నామినేటెడ్ పదవి రాని వారికి ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.

 

 

 

 

 

 

ముఖ్యంగా వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇప్పటికే ఉన్న కార్పోరేషన్ల పాలక మండలిలను రద్దు చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లలో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వందకు పైగా డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. ఈ పదవులు భర్తీ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలో పలువురు సీనియర్ నాయకులకు డైరెక్టర్ల పదవులు దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. వీటితో పాటు పలు మార్కెట్ కమిటీల చైర్మన్ల పదవీ కాలం ముగిసినప్పటికీ నూతన చైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న మార్కెట్ కమిటీలతో పాటు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల పదవీ కాలం సైతం దగ్గర పడుతుండడంతో పార్టీలోని ముఖ్య నాయకులు వీటిపై దృష్టి సారిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా తమను ఏదో ఒక పదవి వరిస్తుందని ధీమాతో ముందుకెళ్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంఎల్ఎలు ప్రతిపాదించిన నాయకులకే కాకుండా ప్రత్యేకంగా కొందరికి ఈ పదవులు దక్కే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 

 

 

 

 

 

కొన్ని నియోజక వర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న నాయకులకు కొందరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యతనివ్వడం లేదని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఎంఎల్ఎల వద్ద ప్రాధాన్యత దక్కడంతో పార్టీలోని సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి నేతల పేర్లను కూడా ఎమ్మెల్యేలు ఈ పదవుల కోసం ప్రతిపాదించలేదనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నా వారిని జిల్లాల వారీగా గుర్తించి నామినేటెడ్ పదవులను కేటాయించాలని సిఎం కెసిఆర్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద ఈ పదవుల భర్తీలో పాత, కొత్త నేతలకు సమన్యాయం జరిగేలా అధినేత కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారనే ప్రచారం సాగుతోంది. కాగా జిల్లా స్థాయిలోని కీలకమైన కొన్ని నామినేటేడ్ పదవులు కూడా భర్తీకి నోచుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో మిగిలిన నామినేటెడ్ పోస్టులను పార్టీ కోసం పాటు పడే వారికి అందించి అసంతృప్తిని తొలగించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో ఒక్కటవుతున్న ఆప్, కాంగ్రెస్

 

Tags: Looking for nominated posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *