దోచేస్తున్న దళారులు 

Date:19/05/2018
ఖమ్మం ముచ్చట్లు:
పౌర సరఫరాలశాఖ, మార్క్ ఫెడ్‌ అధికారుల పర్యవేక్షణ లేమి.. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన లోపం వెరసి జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో సన్న, చిన్నకారు రైతులు నడి వేసవిలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల కిందట నాగులవంచ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై అప్పటి మార్క్‌ఫెడ్‌ డీఎం సస్పెండ్‌ అయినా అధికారుల పర్యవేక్షణలో మార్పు లేకపోవడం గమనార్హం. దళారుల తీసుకొచ్చిన మొక్కజొన్నను వేల క్వింటాళ్ల మేర ఆఘమేఘాల మీద కొనుగోలు చేస్తూ.. వాస్తవంగా సాగు చేసిన రైతును రోజుల తరబడి కాంటాలు వేయకుండా అవస్థల పాలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు ఇతర మండలాల్లో భారీ ఎత్తున తక్కువ ధరకు రైతుల వద్ద కొనుగోలు చేసిన సరకును మార్క్‌ఫెడ్‌ కేంద్రాలో రైతుల వేషం ఎత్తి విక్రయిస్తున్నారు.
మార్క్ ఫెడ్‌ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో దళారుల హవా ఎక్కువైంది. చింతకాని మండలంతో పాటు సమీప వైరా, బోనకల్లు, కొణిజర్ల మండలాలకు చెందిన దళారులు గ్రామాల్లో రైతుల వద్ద తక్కువ ధరకు, తేమ శాతం ఎక్కువ, నాణ్యత లేని సరకును తక్కువ ధరకు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్‌ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే రైతులు వీఆర్వో, ఏఈవోలతో ధ్రువీకరణ పత్రం తీసుకొని రావాల్సి ఉంది. ఏఏ సర్వే సంఖ్యల్లో సాగు చేశారు..? ఎంత విస్తీర్ణంలో? ఎంత దిగుబడి వచ్చింది..? రైతు పేరు..? గ్రామం సహా పూర్తి వివరాలతో వీఆర్వో, ఏఈవోలు ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంది. కొందరు పత్రాల జారీ విషయాన్ని ‘మామూలు’గా తీసుకోవడంతో అక్రమార్కుల చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
దళారుల అవతారాలు ఎత్తిన వ్యాపారులకు వీఆర్వోలు పలు గ్రామాల్లో వారి బంధువులు పేరు మీద భూమి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పీఏసీఎస్‌ అధికారులు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం మొక్కజొన్న మద్దతు ధరను రూ.1425గా నిర్ణయించింది. అక్రమార్కులు పల్లెల్లో నాణ్యత లేమి, తేమ శాతం ఎక్కువ ఉన్న మొక్కజొన్నను కేవలం రూ.970 నుంచి రూ.1050 వరకూ కొనుగోలు చేసి నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. క్వింటాకు సరాసరి రూ.425 లాభపడుతున్నారు. ఈ విక్రయాల్లో పలు శాఖల ప్రమేయం ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకూ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన వాటిలో సగం దళారులవే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
* నాగులవంచ కొనుగోలు కేంద్రానికి వైరా మండలానికి చెందిన ఒక వ్యాపారి 500 క్వింటాళ్ల మొక్కజొన్నను తీసుకొచ్చారు. అనుమానం వచ్చిన పీఏసీఎస్‌ ఛైర్మన్‌, సీఈవోలు మొక్కజొన్నను కాటా వేయవద్దని సిబ్బందికి, హమాలీలకు సూచించారు. దీంతో సదరు వ్యాపారి తన సమీప బంధువైన పాతర్లపాడుకు చెందిన ఒక రైతు పేరు మీద భూమి ఉన్నట్లు వీఆర్వో, ఏఈవోలతో ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చారు. ఆ వ్యాపారి అధికార పార్టీ నేతలతో ఫోన్లు చేయించటంతో గత్యంతరం లేని పీఏసీఎస్‌ సిబ్బంది మూడు రోజులు పాటు వేచి చూచి వెయ్యి కింటాళ్లను కాటా వేయాల్సి వచ్చింది. ఈ విషయమై తహసీల్దార్‌కు కూడా పలువురు రైతులు ఫిర్యాదు చేశారు.
చింతకానికి చెందిన ఒక వ్యక్తి చింతకాని, నేరడ, నరసింహాపురం, రేపల్లెవాడకు చెందిన పలువురి వద్ద పెద్ద ఎత్తున మొక్కజొన్నను కొనుగోలు చేసి చింతకాని మార్క్‌ఫెడ్‌ కేంద్రానికి తీసుకొచ్చారు. సదరు వ్యక్తి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తనకు అనుకూలంగా ఉన్న పలువురి రైతుల పేరు మీద వీఆర్వో, ఏఈవోల ధ్రువీకరణ పత్రాలు తీసుకొచ్చి వెయ్యి కింటాళ్లపైనే విక్రయించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి దళారుల వల్ల సన్న, చిన్నకారుకు చెందిన పలువురి రైతులు కాంటాల కోసం రోజుల తరబడి కేంద్రాల్లో వేచి చూడాల్సి వస్తోంది.
Tags: Looting troops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *