చర్చనీయాంశం గా మారిన లాటరైట్ గనుల వ్యవహారం

Lottery mines dealing in the spotlight
Date:11/02/2019
రాజమండ్రి ముచ్చట్లు:
జిల్లాలో లాటరైట్ గనుల వ్యవహారం చర్చనీయాంశమైంది. వంతాడను ఆనుకొనే ప్రత్తిపాడు మండలం గిరిజనాపురం అటవీ ప్రాంతంలో లీజు పొందిన సంస్థ కార్యకలాపాలపై ఉన్నట్టుండి ఆదాయపన్ను శాఖ దృష్టి సారించింది. రెండు రోజులుగా అవిశ్రాంతంగా సోదాలు చేస్తోంది. వివరాలు బయటకు పొక్కకుండా గనుల సిబ్బందిని కట్టడిచేస్తూ ఆదాయ వ్యయాలను లెక్కిస్తున్నారు. అండ్రు మినరల్స్‌ కార్యకలాపాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. తవ్వకాలు, లాటరైట్‌ రవాణా సైతం నిలిచిపోగా మైనింగ్‌, డంపింగ్‌ యార్డులు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఐటీ అధికారులు చెమటోడుస్తున్నా కొండల్లో లెక్కలు కొలిక్కి రాలేదు. మట్టి లెక్కలను దస్త్రాల్లోంచి చూడ్డానికి డంపింగ్‌ యార్డులోనే తిష్ఠ వేశారు. టర్నోవరు, ఐటీ రిటర్న్స్‌తో పాటు గనుల్లో ఎంత తవ్వారు? ఇప్పటికి ఆదాయం ఎంత? ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీలు, ఇన్‌కంటాక్సులు, ఎలా లావాదేవీలు జరిగాయి? జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు ఇలా డబ్బుతో ముడిపడిన ప్రతి అంశాన్ని తరచి చూస్తున్నారు.
రవాణా పరిమితులు, తీరు తెన్నులు అందుకు సంబంధించిన అనుమతులు, ప్రభుత్వానికి చెల్లింపులను తనిఖీ చేస్తున్నారు. మైనింగ్‌ నిబంధనలను బట్టి లెక్కల్లో మునిగారు. డంపింగ్‌ యార్డులో ఉన్న లాటరైట్‌ నిల్వలపైనా ఆరా తీశారని తెలుస్తోంది. ‘కొండం’త ఆర్థిక వ్యవస్థగా లాటరైట్‌ కార్యకలాపాలు 2004 నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గంలో సాగుతున్నాయి. ఆందోళనలు, ఉద్యమాల నుంచి రాజకీయ పార్టీల అధినేతలందరినీ రప్పించుకొని అక్రమాలను లోకం కళ్లకు కట్టిన వంతాడలో మూడేళ్ల క్రితం లీజులు రద్దయ్యాయి. రూ. 14 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని తేల్చారు. రాబట్టినదెంతనేది అందరికీ తెలిసిందే అయినా.. ఇక్కడి కనుమల్లో ఉన్న లాటరైట్‌ తవ్వకాల ద్వారా ఎందరో ఎదిగారు. భారీ ఆదాయ వనరుగానే కొండలవైపు చూడడం పరిపాటిగా మారింది. వంతాడ నుంచి చింతలూరు వరకూ కొండల్లో హద్దులు చెరిపేసి తవ్వకాలు సాగించినా ఉద్యమాలు జరిగే వరకూ యంత్రాంగం దృష్టిపెట్టలేదు. లీజులిచ్చి ఊరుకోవడం తప్ప ఎంత తవ్వారు? ఎలా తరలించారు? ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండి కొట్టారు? లీజు హద్దులు మీరుతున్నారా? అనే మౌలిక అంశాలపైనా అనుశీలన లేకుండా గనుల దోపిడీకి భరోసా ఇచ్చారు. వంతాడలో లీజుల రద్దు తర్వాత కొత్తపాఠాలు నేర్వకుండా.. పాత ధోరణిలోనే గనులను లీజుదారులకు వదిలేశారు.
అడపాదడపా విజిలెన్సు తనిఖీలు జరిగినా చర్యలు కొండల మధ్యే ఉండిపోయాయి. వంతాడ ఉదంతాల దరిమిలా అటవీ ప్రాంతంలో లీజులు పొందిన అండ్రు మినరల్స్‌ కార్యకలాపాలపైనా యంత్రాంగం పర్యవేక్షణ, నిఘా పెద్దగా లేదు. మెటీరియల్‌ రవాణాలో అవాంతరాలు ఎదురైనా, ప్రమాదాలు జరిగినా, స్థానికంగా తమ కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తినా ‘సర్దుబాటు’ తంత్రమే అమలవుతోంది. ఇక్కడి మైనింగ్‌ సంస్థలు అందరి నేతలకు సమదూరంలోనే ఉండడం ద్వారా తమ కార్యకలాపాలను సానుకూలం చేసుకోవడం పరిపాటి. 2004 నుంచి గనుల తవ్వకాలు ఇక్కడ జరగుతున్నాయి. మహేశ్వరి మినరల్స్‌ తదితర సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు సాగించాయి. మైనింగ్‌ ముమ్మరంగా చేసిన ఓ సంస్థ 2011 నుంచి 2014 వరకూ ఏటా సగటున రూ. నాలుగు కోట్ల ఆదాయపన్ను చెల్లించిందని తెలుస్తోంది. రాయల్టీ, వ్యాట్‌లను ఇదే తీరుగా కట్టింది. అదే సంస్థ అక్రమాలు తారస్థాయిలో జరిగాయని ప్రజాపద్దుల సంఘంతో సహా అన్ని విచారణలు తేల్చాయి. గనుల్లో ఆదాయానికి చూపే లెక్కలకు తేడాపాడాలున్నాయని పదేపదే రుజువయింది. క్వారీ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చుచేసేలా ఏర్పాటైన జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌కు సింహభాగం ఇక్కడి గనుల ఆదాయం ద్వారానే సమకూరుతోంది. ముమ్మరంగా తవ్వకాలు జరిగితే నెలకు కనీసం పది వ్యాగన్లు తగ్గని మెటీరియల్‌ ఎగుమతి అవుతుంది.
Tags:Lottery mines dealing in the spotlight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *