నష్ట నివారణ చర్యలకు దిగిన కమలం

Lotus landed for loss prevention measures

Lotus landed for loss prevention measures

Date:21/11/2018
జైపూర్ ముచ్చట్లు:
చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ తనదైన పాచికతో ముందుకు వెళుతోంది. రాజస్థాన్ లో గెలుపు కష్టమేనని దాదాపు అన్ని సర్వేలూ తేల్చి వేయడంతో కమలం పార్టీ పెద్దలు దాదాపు మానసికంగా సిద్ధమయ్యారు. అయితే ఏదైనా మ్యాజిక్ జరిగి విజయం తమను వరిస్తుందేమోనన్న ఆశకూడా వారికి లేకపోలేదు. అందుకే ప్రతి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన దైన శైలిలో పావులు కదుపుతున్నారు.రాజస్థాన్ లో ముఖ్యమంత్రి వసుంధర రాజేపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసిందే. దాదాపు ప్రతి సర్వే కూడా కమలం పార్టీ ఓడిపోవడం తధ్యమనే చెప్పాయి. దీంతో వ్యూహం మార్చిన భారతీయ జనతా పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న వ్యతిరేకత నుంచి కొంత బయటపడేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సీట్లు నిరాకరించింది. వీరంతా ఇతర పార్టీల్లోకి వెళతారని, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారని తెలిసీ మార్చేందుకు బీజేపీ అధిష్టానం ఏమాత్రం వెనకాడలేదు. దాదాపు మూడో వంతు కొత్తవారికి రాజస్థాన్ లో అవకాశమిచ్చారు.రాజస్థాన్ లో కాంగ్రెస్ అగ్రనేతలను నిలువరించేందుకు బీజేపీ కొత్త అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది.
నామినేషన్ చివరిరోజైన సోమవారం నాడు అనూహ్యంగా ముస్లిం అభ్యర్థిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిపై బరిలోకి దించి కొత్త ఎత్తులకు దిగింది కమలం పార్టీ. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ లు ఇద్దరికీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నిఅధిష్టానం కల్పించింది. ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థో ఇప్పుడు ప్రకటించకున్నా ఇద్దరు నేతలు సఖ్యతగా ఎన్నికల వరకూ పనిచేస్తారనే ఇద్దరినీ అసెంబ్లీ బరిలోకి దింపింది.అశోక్ గెహ్లట్ గతంలో అసెంబ్లీకి పోటీ చేసి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కానీ సచిన్ పైలట్ మాత్రం ఇప్పటి వరకూ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగలేదు. తొలిసారి ఆయన రాష్ట్రంలోని టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టోంక్ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల ఓట్లున్న ముస్లిం సామాజికవర్గం బలంగా ఉంది. ఇక్కడ తొలుత బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ సింగ్ కు టిక్కెట్ ఇచ్చినా నామినేషన్ చివరిరోజున వ్యూహం మార్చి మంత్రి యూనస్ ఖాన్ ను టోంక్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడంతో సచిన్ పైలట్ కు విజయం నల్లేరు మీద నడక కాదని తేలిపోయింది. దీంతో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేయాల్సిన అవసరం ఏర్పడింది. రాజస్థాన్ లో ఆశలు పూర్తిగా వదులకున్న కమలం పార్టీ ఎత్తుకుపైఎత్తులతో కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తామని నమ్మకంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Tags:Lotus landed for loss prevention measures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *