సమాధులనూ వదలని మాఫియా 

Date:15/03/2018
అనంతపురం ముచ్చట్లు:
జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగుతోంది.  చిత్రావతి నదీగర్భాన్ని తోడేసిన ఇసుకాసురులు… నది ఒడ్డున ఉన్న సమాధులను కూడా తవ్వేస్తున్నారు. అడిగేవారు లేరు కదా అని ఏకంగా వల్లకాడు ఉన్న ప్రాంతంలో తవ్వకాలు చేసి ఇసుకను తీసుకెళుతున్నారు. ఇసుకాసురుల ధాటికి సమాధుల్లో నుంచి కళేబరాలు బయటపడుతున్నాయి. ఇసుక రవాణా కాసులు కురిపిస్తుండటంతో ఇసుక తోలేందుకు ఏకంగా ట్రాక్టర్లనే కొనుగోలు చేస్తున్నారు. ధర్మవరం మండలంలోని పోతులనాగేపల్లి, తుంపర్తి, సీసీ కొత్తకోట ప్రాంతాల్లో ఉన్న చిత్రావతి నది నుంచి రోజూ వంద ట్రాక్టర్ల ఇసుకను ధర్మవరం పట్టణంతోపాటు పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిత్రావతి నదిలో ఇసుక తరలింపును నియంత్రించాల్సిన రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. చిత్రావతి నదిలో ఇసుక నిల్వలు తరిగిపోతుండటంతో అక్రమంగా ఇసుకను తరలించేవారు పోతులనాగేపల్లి గ్రామం వద్ద నది ఒడ్డున ఇసుకను తవ్వుతున్నారు.చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుక పట్టపగలే ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ధర్మవరం మండలం పరిధిలోని పోతులనాగేపల్లి, సీసీ కొత్తకోట, తుంపర్తి గ్రామాల పరిధిలో ఉన్న చిత్రావతి నదిలో ఇసుకను తోడేస్తున్నారు. ధర్మవరం పట్టణంలో గృహనిర్మాణ పనులకు, పలు అభివృద్ధి పనులకు ఇక్కడి నుంచే ఇసుకను తరలిస్తున్నారు. ఇసుకను తరలించేందుకే ధర్మవరం మండలంలోని పోతులనాగేపల్లి గ్రామంతో పాటు సమీప గ్రామాలకు చెందినవారు వంద ట్రాక్టర్లకు పైగా కొనుగోలు చేశారు. ధర్మవరం పట్టణం నుంచి మరికొందరు ట్రాక్టర్లతో చిత్రావతి నదిలోని ఇసుకను తీసుకెళుతున్నారు. వేలాది ట్రాక్టర్ల ఇసుకను ఇప్పటికే తోడేయటంతో చిత్రావతి నదిలో ఇసుక నిల్వలే తరిగిపోతున్నాయి.పోతులనాగేపల్లిలో ప్రధాన రహదారుల మీదుగా ధర్మవరానికి ట్రాక్టర్లలో ఇసుక తరలుతోంది. గ్రామానికి చెందిన ట్రాక్టర్లే 30కి పైగా ఉండటంతో ఆ గ్రామంలో ఇసుక తరలింపుపై ప్రశ్నించేందుకు భయపడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ఇబ్బందుల పాలు చేస్తుండటంతో కళ్లెదుటే ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నా తల పక్కకు తిప్పుకొని వెళుతున్నారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు ధర్మవరంలో ఉన్నా పోలీసుస్టేషన్ల ముందే ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నా వాటిని పట్టుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. పోతులనాగేపల్లిలో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలతో గ్రామం నిత్యం హోరెత్తుతోంది. పిల్లలు, మహిళలు రహదారిపైకి రావాలంటే ఇసుక ట్రాక్టర్లు ఎక్కడ దూసుకువస్తాయోనని భయంభయంగా రావాల్సి వస్తోంది.చిత్రావతి నది నుంచి ప్రతిరోజూ 500 ట్రాక్టర్ల ఇసుక తరలుతోంది. ఒక్కో ట్రాక్టర్‌తో ఐదు ట్రిప్‌ల ఇసుకను రోజుకు తీసుకువెళుతున్నారు. ధర్మవరం పట్టణానికే అధికసంఖ్యలో ట్రాక్టర్లు వస్తున్నాయి. గృహనిర్మాణాలకు, వివిధ అభివృద్ధి పనులకు ఇసుకను వినియోగిస్తున్నారు. ఒక్కోట్రాక్టర్‌ ఇసుకను రూ.800 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. రోజుకు రూ.5 లక్షల విలువైన ఇసుక అక్రమంగా తరలుతోంది. నెలకు రూ.కోటిన్నర విలువైన ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక వ్యాపారం లాభసాటిగా ఉండటంతో వ్యవసాయ పనులకు కాకుండా ఇసుకను తరలించేందుకే ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారు.చిత్రావతి నదిలో ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటాయి. చిత్రావతినది పక్కనే ఉన్న పోతులనాగేపల్లి గ్రామానికి సత్యసాయి తాగునీటి పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. స్థానికుల్లో ఐక్యత లేకపోవడం, ఇసుక తరలింపు ఆదాయవనరుగా ఉండడంతో ఇసుకాసురులు పేట్రేగుతున్నారు. ఇసుకను తోడేయడంతో సమీప గ్రామాల్లో గతంలో బోరుబావులు ఎండిపోయాయి. గత ఏడాది వర్షాలు పడటంతో బోరు బావుల్లో నీరు చేరింది. ఇసుక తరలింపు ఇలాగే కొనసాగితే పాత పరిస్థితే వచ్చే ప్రమాదం ఉంది.
Tags: Mafia in the graves

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *