క్వారీల్లో అక్రమాలకు మాఫియా తెర

Mafia screen for irregularities in quarries

Mafia screen for irregularities in quarries

Date:10/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
అక్రమ మైనింగ్‌ను ఆపేయాలంటూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలోని మైనింగ్‌ మాఫియా కొత్త రూటు ఎంచుకుంది. అనుమతులున్న క్వారీలను నిర్వహించేందుకు సైతం నిబంధనలను సాకుగా చూపి అనుమతించని మైనింగ్‌ అధికారులు.. ఈ భూములను అనుచరులు కొనుగోలు చేయగానే అవన్నీ మరిచిపోనున్నారు. వారికి అనుమతులు మంజూరు చేసేందుకు వేగంగా ఫైళ్లు కదులుతున్నాయని తెలుస్తోంది.గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అక్రమ క్వారీలను నిలిపివేయాల్సిన అధికారులు ఈ ప్రాంతంలోని అన్ని క్వారీలను నిలిపివేశారు.
క్వారీ లీజుదారులపై కేసులు నమోదు చేయడం దగ్గర్నుంచి మిల్లర్లకు నోటీసులు జారీ చేయడం వరకు అన్ని కనుసన్నల్లో చకచకా చేసేశారు. వారికి నోటీసులు ఇవ్వడంతోపాటు, కేసుల్లో ఇరికించడం వల్ల తాము చెప్పినట్లు వింటారనేది వారి ఆలోచన. అనుకున్న విధంగానే మిల్లర్లకు ట్రాన్సిట్‌ పాస్‌లు నిలిపివేయించారు. వారు బంద్‌కు దిగగానే తిరిగి వాటిని అధికారులతో ఇప్పించి మిల్లర్లు, క్వారీ లీజుదారులను తాము చెప్పినట్లుగా వినేలాచేశారు. కేసుల భయంతో మిల్లర్లు, క్వారీ లీజుదారులు కూడా ఇష్టంలేకపోయినా మైనింగ్‌ మాఫియా ఆదేశాలను పాటిస్తూ వస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో భారీ దోపిడీకి అధికార పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దందాలో అటు మిల్లర్లు, ఇటు సున్నపురాయి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లీజుదారుల నుంచి నయానో భయానో క్వారీలను సొంతం చేసుకుని ఆ తర్వాత అనుమతులు రప్పించి కోట్లు కొల్లగొట్టడానికి మాఫియా పథకం రచించింది. దీనికి ఓ మైనింగ్‌ అధికారి సహకారం కూడా ఉందని తెలుస్తోంది. తాము చెప్పిన ధరకే తెల్లరాయి కొనాలని హుకుం జారీ చేశారు. మరోపక్క లీజుదారులను ఎక్కడ లేని నిబంధనలతో మైనింగ్‌ అధికారి బెంబేలెత్తించారు. క్వారీలన్నింటిని మాఫియాకు అప్పజెప్పేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు. లీజుదారుల నుంచి మైనింగ్‌ మాఫియా చేతుల్లోకి క్వారీలు వెళ్లగానే నిబంధనలను సడలించేందుకు రంగం సిద్ధం చేశారు.
క్వారీలన్నీ తమ చేతికి రాగానే అక్రమాలకు పాల్పడుతూ.. నిబంధనల ప్రకారం అంతా సక్రమంగానే ఉన్నట్లు చూపడానికి ఈ ఎత్తు వేశారు. మైనింగ్‌ మాఫియాకు ఎదురు చెప్పలేక మిల్లర్లు, క్వారీల లీజుదారులు మౌనంగా ఉండిపోతున్నారు. ట్రక్కు తెల్లరాయి రూ.1500 ఉండగా, దాన్ని రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. తాము చెప్పిన ధరకు కొనుగోలు చేస్తే ఎవ్వరికీ ఇబ్బందులు ఉండవని, లేని పక్షంలో ఈ సంక్షోభం ఇలానే కొనసాగుతుందంటూ మిల్లర్లను భయపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Tags:Mafia screen for irregularities in quarries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *