శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో మే 21 నుండి 25వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి.శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు 2021 సెప్టెంబరు 14న పనులు ప్రారంభించారు. విమాన గోపురం పనులు పూర్తి కావడంతో జీర్ణోద్ధరణ, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.గురువారం ఉదయం 4 నుండి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 7.45 నుండి 9.15 గంటల వరకు మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఆ తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందించారు. ఉదయం 11.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనం కల్పించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు పెద్ద శేష వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహా దారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జెఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏవో బాలాజీ, డిఎల్వో వీర్రాజు, డిప్యూటీ ఈవోలు శాంతి, గోవింద రాజన్, ఈఈ మనోహర్, విజివో మనోహర్, ఏఈవో రవి కుమార్, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనంజయులు, రాధా కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Mahasamprokshan of Sri Govindaraja Swamivari temple in science
