Natyam ad

మమతా స్వరం మారుతోంది.

కోల్ కత్తా ముచ్చట్లు:

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటారు. రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన మమతా బెనర్జీకి ఆ విషయం ఇటీవలే తెలిసిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా విమర్శలతో విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన గొంతు సవరించుకున్నారు. స్వరం మార్చారు. విమర్శల వాడిని తగ్గించారు. మెడీ మంచివాడేనన్నట్లుగా మాట్లాడారు. ఇంతకీ అసెంబ్లీ వేదికగా ఆమె మోడీపై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన సందర్భం ఏమిటయ్యా అంటే… కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తదితర ఏజెన్సీలకు వ్యతిరేకంగా తీర్మానించిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఇటీవలి కాలంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై ఈడీ సీబీఐలు దూకుడుగా వ్యవహరిస్తుండటం, కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండటం తెలిసిందే. ఇటీవలి కాలంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థ ఛటర్జీ ఉపాధ్యాయ నియామక స్కాంలో అరెస్టయ్యారు. సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడిగా పేరొందిన పార్థా ఛటర్జీ అరెస్టు అయిన తరువాత పార్టీ కేబినెట్ నుంచి బర్త్ రఫ్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ బీర్బూమ్ జిల్లా అధ్యక్షురాలు అనుబ్రతా మోండల్ పశువుల అక్రమ రవాణా కేసులో అరెస్టయ్యారు.

 

 

Post Midle

ఒక్క తృణమూల్ కాంగ్రెస్ అనేమిటి.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో నాన్ బీజేపీ  పార్టీలు, నేతలు లక్ష్యంగా సీబీఐ,ఈడీ,ఐటి దాడులు జరుగుతున్నాయని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వాస్తవానికి కేంద్ర దర్యాప్తు సంస్ధల   దాడుల్లో నాన్ బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలే ఎక్కువమంది అరెస్టవుతున్నారు. ఢిల్లీ, కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్,తెలంగాణా  రాష్ట్రాల్లో కూడా బీజేపీయేతర పార్టీల నాయకులు లక్ష్యంగా దాడులు జరిగాయి, జరుగుతున్నాయన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే  నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి మరీ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి.ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. తృణమూల్ సభ్యులు నిర్మల్ ఘోష్, తపస్ రాయ్  శాసనసభలో రూల్ 169 కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేతలను ఎంపిక చేసి భయాందోళనకు గురిచేస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఇంత వరకూ బానే ఉంది ఆ తరువాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సభలో చేసిన ప్రసంగమే అందరినీ ఆశ్చర్య పరిచింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్షాలను టార్గెట్ చేసి నిర్వహిస్తున్న దాడులు ప్రధాని మోడీకి తెలిసే జరుగుతున్నాయని తాను విశ్వసించడం లేదని మమతా బెనర్జీ అన్నారు.

 

 

ఈ దాడుల వెనుక మోడీ ప్రమేయం లేదని చెప్పారు. అయితే మమత తన ప్రసంగంలో మోడీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసి అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నలలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. మొత్తం మీద మమతా బెనర్జీ మోడీ పట్ల సానుకూల ధోరణిలో మాట్లాడటమే రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల నజర్ లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మరింత మంది ఉండటంతో ఆమె మోడీతో ఘర్షణాత్మక ధోరణిలో కాకుండా సామరస్యంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే తన సహజ శైలికి భిన్నంగా విపక్ష నేతలు టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వెనుక మోడీ ఉన్నారని తాను భావించడం లేదని అన్నారు. ఒక వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, మరో వంక మోడీకీ ఈ దాడులకూ సంబంధం లేదనడం ద్వారా మమతా రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించారని, కేంద్రంతో పోరాడుతూనే.. మోడీ ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలన్న వ్యూహంతోనే ఆమె అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడి ఉంటారని పరిశీలకులు అంటున్నారుపార్థా ఛటర్జీ అరెస్టు తరువాత నుంచీ కూడా కేంద్రంపై మమత విమర్శల దూకుడు తగ్గించిన విషయాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా పార్థ ఛటర్జీ అరెస్టు విషయంలో మమతా బెనర్జీ స్పందించకపోవడాన్ని, పార్థ ఛటర్జీ స్వయంగా ఫోన్ చేసినా కూడా ఆమె ఆన్సర్ చేయకపోవడాన్నీ కూడా వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. చిక్కుల్లో పడటం కంటే తగ్గి స్వాంతన పొందడమే మేలని మమత భావిస్తున్నారని విశ్లేషణలు చేస్తున్నారు.

 

Tags: Mamata’s voice is changing.

Post Midle