మాండ్య మామూలు నియోజకవర్గం కాదు

 Date:26/03/2019

బెంగళూర్ ముచ్చట్లు:
మాండ్య మామూలు నియోజకవర్గం కాదు. అతి సంపన్న మైన నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు ఆగ్రహం వచ్చినా…అభిమానం వచ్చినా ఓట్ల రూపంలో కురిపించేస్తారు. అలాంటి మాండ్య నియోజకవర్గంలో ఇప్పుుడు రసవత్తరమైన పోటీ జరుగుతోంది. జనతాదళ్ ఎస్ అభ్యర్థిగా దేవెగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలోకి దిగారు. సంకీర్ణ ధర్మంలో భాగంగా మాండ్య స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు వదిలిపెట్టింది. కానీ ఇక్కడ సినీనటుడు అంబరీష్ కు మంచి పట్టుంది. ఆయన సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్ధిగా మాండ్య నుంచి పోటీలో ఉన్నారు.అంబరీష్ కాంగ్రెస్ పార్టీకి సేవలందందిచినా…. మాండ్య నుంచి హ్యాట్రిక్ విజయాలు పార్టీకి తెచ్చిపెట్టినా కాంగ్రెస్ ఈ స్థానాన్ని వదులుకుంది. దేవెగౌడ తన మనవడికి సేఫ్ సీట్ కోసం మాండ్యను ఎంచుకోవడంతో సుమలతకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కలేదు. తన భర్త అంబరీష్ ఆశయ సాధన కోసం అంటూ సుమలత రాజకీయ రంగప్రవేశం చేశారు. సుమలతకు అండగా సినీ పరిశ్రమ కొంత వెన్నుదన్నుగా నిలబడింది. కాంగ్రెస్ లో నేతలు, క్యాడర్ సయితం సుమలతకే జై కొట్టింది. దీంతో దెవెగౌడ కాంగ్రెస్ నేతలతో మాండ్య నియోజకవర్గంపై చర్చలు జరిపారు. అక్కడ మంత్రి డీకే శివకుమార్ ను పంపి బుజ్జగించే చర్యలు చేపట్టారు.
సుమలతకు అంబరీష్ అభిమానులు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు అండగా ఉందని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మాండ్య ప్రాంతానికి చెందిన వారే. సుమలత ఆయన ఆశీస్సులను కూడా పొందారు. ఆయనకు పట్టున్న ప్రాంతం కావడంతో సుమలత ముఖ్య నేతలందరినీ కలిసి తన మద్దతును కోరుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కుమారస్వామి, దేవెగౌడ లు సయితం మాండ్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిఖిల్ గౌడ కు పార్టీ ఓటు బ్యాంకుతో పాటు సినీగ్లామర్ కూడా కలసి వస్తుందని దళపతి నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మాండ్యలో రసవత్తర పోరు జరిగే అవకాశముంది.మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభ్యర్థిని పోటీ చేయించేందుకు సుముఖంగా లేదు. స్వతంత్ర అభ్యర్థి సుమలతకే మద్దతివ్వాలని నిర్ణయించింది. సుమలతకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ క్యాడర్ సహకరిస్తే నిఖిల్ గౌడకు ఇబ్బందులు తప్పవన్నది విశ్లేషకుల అంచనా. దేవెగౌడ, కుమారస్వామిని మాండ్యకు పరిమితం చేయాలంటే సుమలతకు మద్దతివ్వాలన్నది కమలం పార్టీ వ్యూహంగా ఉంది. మొత్తం మీద మాండ్య నియోజకవర్గం మాత్రం కర్ణాటక మొత్తం మీద హాట్ సీట్ గా మారింది.
Tags:Mandya is not a simple constituency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *