చేదెక్కుతున్న మామిడి

 Date:14/04/2018
ఖమ్మం ముచ్చట్లు:
మధురఫలంగా పేరొందిన ‘మామిడి’ సాగు ఈ ఏడాది ఉభయ జిల్లాల్లో రైతులకు చేదు అనుభవాలను మిగుల్చుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, గిట్టుబాటు ధర రాకపోవడంతో కొన్నేళ్లుగా రైతులు ఆర్థిక నష్టాలను చవిచూస్తూ వస్తున్నారు. ఒకవైపు అనావృష్టి పరిస్థితులు, మరోవైపు చీడపీడల ఉద్ధృతి వెంటాడడంతో పెట్టుబడులు సైతం రాకపోగా.. అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. ఈసారి ప్రకృతి కరుణించపోవడం, వాతావారణ సమతుల్యం  లోపించడంతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. నాలుగు నెలల పంట కోసం ఎనిమిది నెలలు ఎదురుచూసే వీరి పరిస్థితి దయనీయంగా మారింది. వాతావరణ పరిస్థితులు పూత, కాతపై  ప్రతికూల ప్రభావం చూపించగా దిగుబడులు తగ్గాయి. ఇప్పటికే మామిడి కళకళలాడాల్సిన పరిస్థితుల్లో ఇంకా మార్కెట్లు ప్రారంభించక వెలవెలబోతున్నాయి.మామిడి సాగు చేస్తున్న రైతుల ఆశలు ఈ ఏడాది కూడా ఫలించే పరిస్థితులు కనిపించడంలేదు. సాధారణంగా పూత నవంబరులో ప్రారంభమై జనవరితో ముగుస్తుంది. ఈ ఏడాది అది ఆలస్యం అయ్యింది. ఏటా ఉగాది పండుగ రోజు దస్త్రం పేరిట మార్కెట్లను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మాత్రం ఉగాది దాటి 15 రోజులవుతున్న ఇంకా మార్కెట్లు తెరుచుకోలేదు. కాయ కూడా తక్కువగా వస్తుండడంతో రైతులు ప్రైవేటు వాహనాల్లో హైదరాబాద్‌, వరంగల్‌ తదితర మార్కెట్లుకు సొంతంగా తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దాదాపు 46,500 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి తదితర మండలాల్లో విస్తారంగా మామిడితోటలున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 75 శాతం సత్తుపల్లి నియోజకవర్గంలోనే ఉన్నాయి. బంగినపల్లి, రసాలు, తోతాపురి రకాలు ప్రధానమైనవి. సాధారణంగా ఎకరాకు మామిడి దాదాపు 3 నుంచి 4 టన్నులు దిగుబడి వస్తుంది. ఈ సీజన్‌లో పూత ఇబ్బడిముబ్బడిగా రావడంతో  రైతుల్లో ఆశలు చిగురించాయి. పూత ఆలస్యంగా రావడంతో  ఎకరాకు రెండు టన్నులు మించి దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.  జిల్లా నుంచి ముంబయి, అహ్మదాబాద్‌, నాగపుర్‌, దిల్లీ తదితర ఉత్తరాది ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతాయి. ఇప్పటికే ఇతర ప్రాంతాలకు వెళ్లే మామిడి దిగుబడి తక్కువగా ఉండడంతో ఇంకా మార్కెట్లు ప్రారంభంకాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా మార్చి మంచి నాణ్యమైన కాయ దిగుబడి వస్తుంది. ఏప్రిల్‌కి దాదాపు కోతలు కూడా పూర్తయితే  రైతు దాదాపు నష్టపోయే అవకాశం ఉండదు. కానీ వాతావారణంలో వచ్చిన మార్పుల కారణంగా పూత రావడం బాగా ఆలస్యమవుతుంది. దీంతో ఏప్రిల్‌ నెలాఖరు, మేలోగానీ కాయలు వస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలలో అకాల వర్షాలు, ఈదురుగాలులు వీయడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఏటా సాగు ఆశాజనకంగా లేకపోవడంతో కొందరు కర్షకులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతూ మామిడి తోటలను నరికివేస్తున్నారు. గతంలో మామిడి సాగు చేసిన రైతులు జామ, నిమ్మ తదితర పంటల వైపు మళ్లుతున్నారు.ఈ ఏడాది 30 నుంచి 40 శాతమే మామిడి కాయ దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ధర మాత్రం టన్నుకు రూ.50వేల నుంచి రూ.75వేల వరకు ఉంది. దిగుబడి తక్కువగా ఉండటంతో ధర అధికంగా ఉంది. ఏప్రిల్‌ మొదటివారంలో అకాల వర్షంతో జిల్లాలో దాదాపు వేయి ఎకరాల్లో 10 నుంచి 20 శాతం వరకు మామిడికాయ రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్నేళ్లుగా మామిడి సాగు చేస్తున్న రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దిగుబడి బాగుంటే ధర పడిపోవడం, ధర ఉంటే దిగుబడి తగ్గటంతో ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నారు. గత నాలుగేళ్లుగా మంగు, తెగులు కాయ నాణ్యతపై ప్రభావం చూపటంతో కొనేవారే లేక ఆర్థికంగా కుదేలయ్యారు.
Tags: Mango dropping

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *