మరో ప్రాణం తీసేసిన మాంజా

Date:08/10/2018
జైపూర్  ముచ్చట్లు:
గాలి పటాన్ని ఎగరేసే దారానికి వాడే మాంజా ఓ వైద్యురాలి ప్రాణం తీసింది. ఈ ఘటన  సాయంత్రం కాసర్‌వాడి‌లోని నాసిక్ ఫటా ఫ్లైఓవర్ మీద చోటు చేసుకుంది. పింపుల్ సౌదగర్‌లో నివాసం ఉండే ఆయుర్వేద వైద్యురాలు కృపాలి నికమ్ తన స్కూటర్‌పై పుణే నుంచి భోసారి వెళ్తుండగా.. మాంజా కారణంగా ఆమె గొంతు కోసుకుపోయింది. ‘మాంజాను లాగేయడానికి ఆమె విఫలయత్నం చేసింది. కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో స్కూటర్ మీది నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింద’ని పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్న నికమ్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు తెలిపారు. ఆమె ఆయుర్వేద డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తోందని పోలీసులు తెలిపారు.
ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని, ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా కేసు నమోదు చేశామని చెప్పారు. పుణేలో మాంజా ప్రాణాలు బలిగొనడం గత ఎనిమిది నెలల్లో ఇది రెండోసారి. ఫిబ్రవరి 7న సువర్ణ మజుందార్  అనే మహిళ మాంజా వల్ల గొంతు కోసుకుపోయి మరణించారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ సమీపంలోని శివాజీ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. చైనీస్ మాంజా వాడకంపై దేశవ్యాప్త నిషేధం విధిస్తూ హరిత ట్రైబ్యునల్ గత ఏడాది జూలై‌లో ఆదేశాలు జారీ చేసింది. మాంజా కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లుతోందని చెప్పిన ట్రైబ్యునల్.. మనుషులతోపాటు పక్షులు, జంతువులు గాయపడుతున్నాయని తెలిపింది.
Tags:Manjaja of another life removed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *