ప్రణయ్ ఉదంతంపై మనోజ్ భావోద్వేగ లేఖ

 Date:17/09/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
సమాజంలో తర తరాలుగా వేళ్లూనుకుని పోయిన కుల రక్కసి మారుతీరావు పేరుతో ఈసారి ప్రణయ్‌ని కాటేసింది. తనకంటే తక్కువ కులానికి చెందిన వాడనే కారణంతో నిండు గర్భిణిగా ఉన్న తన కూతురు పసుపు కుంకుమను తుడిచేశాడు ఈ దుర్మార్గుడు. అత్యంత జుగుప్సాకరంగా కూతురి ఎదుటే.. ఆమె భర్త ప్రణయ్‌ని నరికిచంపేశారు. అత్యంత పాశవికమైన ఈ సంఘటన ఒక్కసారిగా సమాజంలో ఉన్న కులజాడ్యాన్ని గుర్తు చేసింది.
మిర్యాలగూడలో జరిగిన ఈ హత్యోదంతంపై సినీనటుడు, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ స్పందిస్తూ.. కుల పిచ్చిని కడిగిపారేశారు. ట్విట్టర్‌లో ప్రణయ్‌కి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ.. భావోద్వేగభరిత లేఖను విడుదల చేశారు. సినిమాలు, రాజకీయాలు, కాలేజీలు, ఆర్గనైజేషన్‌ల పరంగా ఉన్న ఈ కుల, మత జాడ్యాన్ని ప్రోత్సహించే ప్రతి ఒక్కరు ప్రణయ్ హత్యకు బాధ్యులే. ప్రతి ఫీల్డ్‌లోనూ కుల పిచ్చి ఉంది.
ఇది అనాగరికమైన చర్య. కుల ప్రేమికులను, మద్దతుదారులను చూసి సిగ్గుపడుతున్నా. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తే కాకుండా… కులాలను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనకు బాధ్యులే. తమ ప్రేమకు ప్రతిరూపం భూమిపై పడక ముందే తండ్రిని కోల్పోయింది. తండ్రి స్పర్శను చూడకుండానే ఆ పసికందు దిక్కులేనిదైంది.
మనందరికీ హృదయం, శరీరం ఒకే తీరుగా ఉన్నాయి. మనమంతా ఒకే గాలిని పీలుస్తున్నాం… ఒకే సమాజంలో జీవిస్తున్నాం. అలాంటపుడు కులం పేరుతో ఈ వివక్ష ఎందుకు? ఇదొక నివారించాల్సిన పెద్ద రోగం. మనం అంతా ఒక్కటేనని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది? కుల వివక్ష నశించాలి. ఈ మహమ్మారిని వెంటనే అంతం చేయాలి.
కుల, మతాలకంటే మనం మనుషులం అని గుర్తించండి. మనుషుల్లా ప్రవర్తించండి. మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక విన్నపం. మన చిన్నారులకు మంచి భవిష్యత్తును అందిద్దాం. అమృత పరిస్థితి నన్ను ఎంతగానో కలచి వేసింది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రణయ్ భార్య అమృత, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. రిప్ ప్రణయ్’ అంటూ ట్విట్టర్ ద్వారా సమాజంలో ఉన్న కులపిచ్చిపై ఎమోషనల్ ట్వీట్ చేశారు మనోజ్.
Tags:Manoj’s emotional letter on the Pranayam stupor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *