ఎరువు.. ధర దరువు..

Date:06/10/2018
కరీంనగర్ ముచ్చట్లు:
ఈ ఏడాదిలో ఎరువుల ధరలు పలుసార్లు పెరిగాయి. దీంతో రైతులకు ఆర్ధికంగా అదనపు భారం పడుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే వ్యవసాయం మానేయాలనిపిస్తోందని కరీంనగర్‌లోని పలువురు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. పెట్టుబడి ఖర్చు విపరీతంగా ఉంటున్న సమయంలో ఎరువులపై ఖర్చు కూడా పెరిగిపోవడం సమస్యాత్మకంగా ఉందని వాపోతున్నారు.
ఎరువుల ధర అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతుంటే వ్యవసాయాన్ని కొనసాగించే పరిస్థితి, స్థోమత ఉండదని పలువురు అన్నదాతలు అంటున్నారు. ఈ సమస్య కొంతమేరైనా అదుపులో ఉండాలంటే యూరియాపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తున్నట్లుగానే భాస్వరం ఎరువులపైనా ఇవ్వాలని కోరుతున్నారు. ఫాస్ఫారిక్‌ ఆమ్లం పెరిగిన ధరలకు ఎరువుల ధరలు పెంచినట్లుగానే పంటల సాగుకు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా కనీస మద్దతు ధరలు ప్రకటించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
వ్యవసాయ దిగుబడులకు మంచి మద్దతుధర కల్పించాలని అంటున్నారు. ప్రస్తుతం పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధరలకు, పెట్టుబడి ఖర్చులకు ఎక్కడా పొంతన లేకుండా ఉందని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులను ఆదుకోవాలని, ఈ మేరకు ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలని అంతా అంటున్నారు.
వాస్తవానికి రైతులకు కష్టానికి తగ్గ ఫలితం లభించడంలేదు. ఆరుగాలం శ్రమించినా చేతికి అందేది అత్యల్పంగా ఉంటోంది. ఇక పంటలు విక్రయించే సమయంలో పలువురు రైతులు మోసపోతున్నారు. మొత్తంగా కర్షకులకు వ్యవసాయం గిట్టుబాటు కాని వ్యవహారంగానే మారింది. అయితే మరోపని చేసుకోవడం తెలీక రైతులు భూమినే నమ్ముకుని సాగు చేసుకుంటున్నారు. సాగు ఖర్చులు ఎక్కువగానే ఉన్నా అప్పోసప్పో చేసి పంటలు పండించుకుంటున్నారు.
ఇలాంటి రైతులకు పెరిగిపోతున్న ఎరువుల ఖర్చు అదనపు ఆర్ధిక భారంగా పరిణమించింది. ఇదిలాఉంటే అనేకమంది రైతులు అవసరానికి మించి ఎరువులు వినియోగిస్తున్నారని.. అవగాహన లేకే ఇలా జరుగుతోందని నిపుణులు అంటున్నారు. అవసరం మేరకు ఎరువులు వాడితే రైతులకు ఆర్ధికంగా కొంత భారం తగ్గుతుందని చెప్తున్నారు.
నిపుణుల వాదనలోనూ కొంత వాస్తవం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దిగుబడి బాగుండాలని రైతులు ఎరువులు ఎక్కువగానే వినియోగిస్తున్నారు. ఈ అతి వాడకానికి స్వస్తి పలికితే ఖర్చు కొంతమేర తగ్గించవచ్చు. పలువురు రైతులు నేల తీరు తెలుసుకోకుండానే ఎరువులు వినియోగిస్తున్నారు. పొలం దున్నేటప్పుడే భాస్వరం ఎరువులు వేస్తే ఫలితం ఉంటుందని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. ఈ ఎరువు పైపాటుగా వేసే మొక్క గ్రహించదని అంటున్నారు.
పైపాటుగా సూటి ఎరువులైన యూరియా, సూపర్‌ ఫాస్ఫేట్, టాష్‌ మాత్రమే వేసుకోవాలని సూచిస్తున్నారు. భూసార పరీక్షలు చేయించుకుని, వ్యవసాయ శాఖ సిబ్బంది సిఫారసు మేరకే ఎరువులను వాడుకుంటే ఫలితం ఉంటుందని స్పష్టంచేస్తున్నారు.
Tags: Manure .. price grace ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *