ఎరువు దరువు 

Date:15/02/2018
రాజమండ్రి ముచ్చట్లు:
అన్నదాతపై ఎరువుల ధరల రూపంలో మరో బరువు పడబోతోంది. డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగినట్లు ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఉత్తర్వులిచ్చింది. డీఏపీ బస్తాపై (50 కిలోలు) రూ.134, కాంప్లెక్స్‌ ఎరువులపై బస్తాకు గరిష్ఠంగా రూ.118 ధర పెంచడంతో అన్నదాతపై అదనపు భారం పడనుంది. పెరిగిన ధరల ప్రకారం జిల్లాలో వినియోగిస్తున్న ఎరువులను బట్టి లెక్కచూస్తే రూ. 8.71 కోట్ల మేర భారం పడనున్నట్లు ప్రాథమికంగా తేలింది.జిల్లాలో 4.10 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం వరితో పాటు ఇతర వాణిజ్య పంటలకు కలిపి ఏటా 60,912 మెట్రిక్‌ టన్నుల యూరియా, 14,440 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 22 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 20,060 మెట్రిక్‌ టన్నుల మ్యూరేట్‌ ఆప్‌ పొటాష్‌, అయిదు వేల టన్నుల సూపర్‌ ఫాస్పేట్‌ను వినియోగిస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి పెరగిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు తెలిపింది. డీఏపీ బస్తాకు రూ.134 పెరగడంతో టన్నుకు రూ.2,680, కాంప్లెక్స్‌ ఎరువులు బస్తాకు రూ. 118 పెరిగిన ధర ప్రకారం టన్నుకు రూ. 2,360 అవ్వనుంది. జిల్లాలో డీఏపీ 14,440 టన్నుల వినియోగం అవుతుండగా రూ. 3.87 కోట్లు, కాంప్లెక్స్‌ ఎరువులు 20,06 మెట్రిక్‌ టన్నుల వినియోగం ద్వారా రూ. 4.84 కోట్లు మేర అదనంగా రైతులపై భారం పడుతుంది.డీఏపీ, ఇతర కాంప్లెక్ష్ ఎరువుల ధరలను పెంచుతూ ఉత్తర్వులు వచ్చిన నేపధ్యంలో బహిరంగ మార్కెట్‌లో ఎరువుల దుకాణదారులు పలు చోట్ల కొత్త ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. పెరిగిన ధరలు పిబ్రవరి 1 వతేదీ నుంచి అమల్లోకి వచ్చినా.. ఆ తేదీ నుంచి ఉత్పత్తయ్యే ఎరువులకు మాత్రమే వర్తిస్తుంది. పాత నిల్లలను ఎరువుల డీలర్లు పాత ధరలకే విక్రయించాల్సి ఉంది. కొన్ని చోట్ల పాత నిల్వలను కూడా కొత్త ధరలకు విక్రయిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం రబీలో కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. వరిచేలకు రైతులు మూడు దఫాలుగా కాంప్లెక్స్‌ ఎరువులను వేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకూ సగం వినియోగం పూర్తయింది. ఇంకా అవసరం ఉన్న నేపధ్యంలో ఎరువుల దుకాణదారులు పాత స్టాకును పెరిగిన ధరలతో ముడిపెట్టి విక్రయించకుండా వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.
Tags: Manure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *