వివాహిత మహిళలకు అబార్షన్లు చేసుకునే హక్కు వుంది-సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
అబార్షన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతీ మహిళకు అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. “ఎంపీటీ చట్టం ప్రకారం అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేసుకునే హక్కు ఉంది. భారతదేశంలో అబార్షన్ చట్టం ప్రకారం వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య ఎటువంటి భేదం చూపదు. 20-24 వారాల గర్భంతో ఉన్న ఒంటరి లేదా అవివాహిత గర్భిణీలను అబార్షన్‌కు అనుమతించకుండా నిషేధించడం, కేవలం వివాహిత మహిళలను అనుమతించడం అనేది ఆర్టికల్ 14 మార్గనిర్దేశక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది” అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. చట్టం ఎప్పుడూ స్థిరంగా ఉండకూడదని, మారుతున్న సామాజిక వాస్తవాలను కూడా పరిగణనలోకి కూడా తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
వైవాహిక అత్యాచారం కూడా అబార్షన్ల విషయంలో అత్యాచారంగా భావించాలని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, అసురక్షిత గర్భస్రావాలపై ఆందోళన వ్యక్తం చేసింది. “అసురక్షిత గర్భస్రావాలు ప్రసూతి మరణాలకు మూడవ ప్రధాన కారణం. దేశంలో జరుగుతున్న అబార్షన్లలో 60 శాతం సురక్షితం కాదు. సురక్షితమైన అబార్షన్ సేవలకు నిరాకరించడం ద్వారా, నిర్బంధ అబార్షన్ పద్ధతులు అసురక్షితానికి దారితీస్తాయి” అని అభిప్రాయపడింది.

Tags: Married women have right to have abortions-Supreme Court
