కాంగ్రెస్ లో భారీ ప్రక్షాళన

Date:12/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

పార్టీ సంస్థాగత ప్రక్షాళనకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. వర్కింగ్‌ కమిటీ సహా కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ భారీగా మార్పులు చేసింది. రాహుల్‌ విధేయులకే పెద్ద పీట వేసి,
సీనియర్ నాయకులకు ఉద్వాసన పలికింది. ముఖ్యంగా అధిష్ఠానంపై లేఖాస్త్రం సంధించడంలో కీలక భూమిక పోషించిన సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌‌ను కీలక బాధ్యతల
నుంచి తప్పించింది. వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి
తొలగించారు.కిందిస్థాయి నుంచి ఎన్నికలు నిర్వహించి, ఆయా పదవులకు ఎన్నికున్నవారినే నియమించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీలోని 23 మంది సీనియర్లు లేఖ
రాయగా.. ఇందులో గులాంనబీ ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఈ లేఖ రాసినందుకు తనకెవరిపైనా శత్రుత్వం, ద్వేషం లేదని స్పష్టం చేసిన సోనియా గాంధీ.. ఆజాద్‌‌కు
ఝలక్ ఇచ్చారు. ఆయనతోపాటు లేఖపై సంతకాలు చేసిన జితిన్‌ ప్రసాద్, ముకుల్‌ వాస్నిక్‌లకు మాత్రం పదోన్నతి కల్పించారు. లేఖ రాసినందుకు క్షమాపణ కోరిన ముకుల్‌
వాస్నిక్‌ను ప్రత్యేక కమిటీలో చేర్చగా..జితిన్‌ ప్రసాదను ఉత్తరప్రదేశ్‌ బాధ్యతల నుంచి తప్పించి త్వరలో ఎన్నికలు జరగబోయే బెంగాల్‌కు ఇన్‌ఛార్జిగా
నియమించారు.ఏఐసీసీలోనూ భారీ మార్పులు చేశారు. అనేక ఏళ్లుగా వివిధ రాష్ట్రాల బాధ్యతలను నిర్వర్తిస్తోన్న మోతీలాల్‌ వోరా, అంబికా సోనీ, లుజినో ఫెలేరో, మల్లిఖార్జున
ఖర్గే లాంటి వారిని ప్రధాన కార్యదర్శి పదవులనుంచి తొలగించారు. ఆజాద్‌ను బయటకు పంపారనే అపవాదు పడకుండా గాంధీ కుటుంబానికి వీరవిధేయులైన వీరిని
వ్యూహాత్మకంగా సాగనంపారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక వర్కింగ్‌ కమిటీలోకి పి చిదంబరం, తారిఖ్‌ అన్వర్‌, రణదీప్‌ సూర్జేవాలా, జితేంద్రసింగ్‌లను
రెగ్యులర్‌ సభ్యులుగా నియమించారు.కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలాకు ప్రధాన కార్యదర్శికి హోదా కట్టబెట్టి కర్ణాటక వ్యవహారాలను అప్పగించారు. రాహుల్‌
కోటరీలో నెంబర్‌ వన్‌ వ్యక్తి అయిన సూర్జేవాలా- పార్టీ వాణిని సమర్థంగా వినిపిస్తున్నందుకు ఈ ప్రమోషన్‌ కల్పించారని చెబుతున్నారు. వర్కింగ్‌ కమిటీలో రెగ్యులర్‌
సభ్యుడుగా కూడా పదోన్నతి పొందిన ఆయన సంస్థాగత వ్యవహారాలకు సంబంధించిన అనేక కమిటీల్లో కూడాసభ్యుడు. ఇక మరో సభ్యుడు జితేంద్రసింగ్‌కు అసోం బాధ్యతలు
అప్పగించారు.తెలంగాణ ఇన్‌ఛార్జిగా ఉన్న ఒడిశా నేత రామచంద్ర కుంతియాను ఆ బాధ్యతలనుంచి తప్పించారు. ఆయన స్థానంలో తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ను
నియమించారు. తమిళనాడులోని విరుధనగర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఠాగూర్‌ను తమిళనాట కీలకనేతగా మార్చేందుకు రాహుల్‌ ప్రోత్సహిస్తున్నట్లు
తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీనే సోనియా కొనసాగించారు.

 

 

యాదాద్రికి కేసీఆర్..

Tags:Massive purge in Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *