గోషామహల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్

హైదరాబాద్ ముచ్చట్లు:

గోషామహల్. హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గాల్లో రాజకీయ వేడి ఎక్కువగా ఉన్న సెగ్మెంట్‌. గత ఎన్నికల్లో బిజెపి నుంచి రాజాసింగ్ గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు ఇదే. అక్కడ ఓడిన టీఆర్ఎస్‌లో మాత్రం ఇప్పటికీ సీన్‌ మారలేదట. ఆ ఎన్నికల్లో నాయకులు ఏవిధంగా అయితే తన్నుకున్నారో.. ఇప్పుడూ అదే పరిస్థితి ఉందట. నేతలు ఎక్కువైపోయారు. కేడర్‌ను పట్టించుకోవడం లేదు. పైగా ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తెచ్చుకోవాలని చూస్తున్నారే తప్ప పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో లేరట.బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. వయసు మీదపడటంతో సైలెంట్‌ అయ్యారని కేడర్‌ అనుకుంటున్నా.. ఆయన మాత్రం నేనున్నాను అని అప్పుడప్పుడూ బయటకొచ్చి హడావిడి చేస్తున్నారు. గోషామహల్‌లో టీఆర్ఎస్‌ను బలోపేతం చేస్తారనే ఉద్దేశంతో రాథోడ్‌ను రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించింది టీఆర్‌ఎస్‌. కానీ.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పెద్దగా మారలేదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.గోషామహల్‌లో మరో టీఆర్ఎస్‌ నేత నంద బిలాల్‌ హాడివిడి చేస్తుంటారు. మొన్నటి GHMC ఎన్నికల్లో కుమార్తెకు కార్పొరేటర్‌ సీటు ఇప్పించుకున్నారు. బేగంబజారు నుంచి పోటీ చేయించి డిపాజిట్‌ కోల్పోయేరు. ఆ ఎన్నికల్లో నందబిలాల్‌ సత్తా చూసిన తర్వాత ఆయన పై పార్టీ ఆశలు వదులు కుందనే చర్చ జరుగుతోంది.

 

 

 

పైగా ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, నందబిలాల్‌ మధ్య వర్గపోరు నడుస్తుందనే వాదన ఉంది. ఆ కారణంగానే పార్టీ శ్రేణులు కూడా చీలిపోయి.. చెరో శిబిరంలో చేరిపోయాయట. నియోజకవర్గంలో పార్టీ బలహీన పడటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు నేతలు.గోషామహల్‌లో తాజాగా ఆశిష్‌ కుమార్‌ యాదవ్‌ అనే మరో నేత సందడి మొదలైంది. రాథోడ్‌, బిలాల్‌కు పోటీగా పర్యటనలు చేస్తున్నారట ఆశిష్‌. ఈ యువనేతకు కూడా రాజకీయ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది. గతంలో ఆశిష్‌ కుటుంబం నుంచి ఒకరు ఆఫ్జల్‌గంజ్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. పైగా స్థానికత కూడా కలిసి వస్తుందని లెక్కలేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తనకే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారట. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆశిష్‌ యాక్టివ్‌గా ఉండేవారు. అది కూడా టీఆర్‌ఎస్‌లో అక్కరకు వస్తుందని అనుకుంటున్నారట. ఇలా ఎవరికి వారు టికెట్‌ రేస్‌లో ఉండటంతో పార్టీ ఎవరికి పట్టం కడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.ఇక్కడో గమ్మత్తు ఉంది రాథోడ్‌, బిలాల్‌ ఇద్దరికీ బీజేపీ మూలాలు ఉన్నాయి. గోషామహల్‌లో బీజేపీతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని టీఆర్ఎస్‌ పెద్దలు అనుమానిస్తున్నారట. అందుకే క్షేత్రస్థాయి అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట. మరి.. టీఆర్ఎస్‌ పెద్దలు గోషామహల్‌పై పట్టుకోసం ఎలాంటి వ్యూహం రచిస్తారో.. ఎవరికి పట్టం కడతారో చూడాలి.

 

 

Tags: Match-fixing politics in Goshamahal

Leave A Reply

Your email address will not be published.