మే 13న తిరుమల మార్గాల్లో “శుద్ధ తిరుమల – సుందర తిరుమల”- టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి
– ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తాం
తిరుమల ముచ్చట్లు:

తిరుమల రెండు ఘాట్ రోడ్లు, రెండు నడకదారుల్లో మే 13న శనివారం టిటిడి ఉద్యోగులతో సామూహికంగా “శుద్ధ తిరుమల – సుందర తిరుమల” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణపై తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మొదటి ఘాట్ రోడ్డు(18 కి.మీ)ను 7 సెక్టార్లు, రెండో ఘాట్ రోడ్డు(18 కి.మీ)ను 6 సెక్టార్లు, అలిపిరి నడకమార్గాన్ని(8 కి.మీ) 7 సెక్టార్లు, శ్రీవారి మెట్టు మార్గాన్ని(3 కి.మీ) 5 సెక్టార్లుగా విభజించి ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహాదారు డాక్టర్ జయప్రకాశ్ సాయి తదితరులు పాల్గొంటున్నారని చెప్పారు. టిటిడి ఉద్యోగులతోపాటు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, న్యాయశాఖ అధికారులు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొంటారని వివరించారు.
అంతకుముందు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో ఇన్‌చార్జి అధికారులతో పాటు సహాయక సిబ్బంది, శ్రీవారి సేవకుల వివరాలను తెలియజేశారు. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరూ అంకితభావంతో పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఈవో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో తిరుమలను పర్యావరణహితంగా మార్చడంపై భక్తులకు అవగాహన కల్పించాలని, తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, నాన్ డిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ను తీసుకురావడాన్ని పూర్తిగా నివారించాలని ఆయన కోరారు.జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, డిఎల్వో వీర్రాజు, ఎఫ్ఏసిఏఓ బాలాజీ, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఇతర డెప్యుటేషన్ అధికారులు పాల్గొన్నారు.
Tags:May 13 on Tirumala routes “Suddha Tirumala – Sundara Tirumala” – TTD EO AV Dharma Reddy
