హైద్రాబాద్ లో ఎస్టీపీల నిర్మాణం కోసం చర్యలు

Date:13/08/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

చెరువుల పరిరక్షణకు జలమండలి నడుం బిగించింది. మురికికూపాలుగా మారిన చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీటిని కట్టడి చేసేందుకు ఇంటర్షన్ అండ్ డైవర్షన్ల నిర్మాణంతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ)ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఔటర్ రింగు రోడ్డు లోపల వ్యర్థ జలాలతో ప్రమాదకరంగా మారుతున్న చెరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, తొలివిడతలో 26 చెరువులను ఎంపిక చేయాలని  ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చెరువులపై సమగ్ర నివేదిక సమర్పించే బాధ్యతలను షా కన్సల్టెన్సీకి అప్పగించారు. నెలాఖరులో సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.జలమండలి ప్రస్తుతం 169.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యర్థ జలాల నిర్వహణ చేపడుతున్నది. ప్రతిరోజూ పది సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా 750 ఎంఎల్‌డీ మురుగును శుద్ధిచేస్తున్నాయి.

 

వాస్తవంగా మహా నగరంలో రోజూ 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు వెలువడుతుంది. గత ప్రభుత్వాల లోపాలను సరిచేసిన తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగు రోడ్డు లోపల 1,456 చదరపు కిలోమీటర్ల పరిధి వరకు జలమండలి సేవలను విస్తరించింది. అందుకోసం సీవరేజికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేస్తున్నది. మరోవైపు చెరువుల నుండి నాలాలు, అటునుంచి ముసీలోకి చేరుతున్న మురుగునీరు భూగర్భ జలాలను కలుషితం చేస్తున్న తీరునూ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తొలుత చెరువుల్లోకి చుక్క మురుగునీరు వచ్చి చేరకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలో షా కన్సల్టెన్సీ నివేదిక అనుగుణంగా 26 చెరువుల వద్ద ఎస్టీపీలు, ఐ అండ్ డీల నిర్మాణాలు చేపట్టనున్నారు.  మూసీలోకి మురుగు రానీయకుండా జలమండలి ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ప్రతిపాధిత ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టాలంటే చాలా చోట్ల స్థలం సమస్య అడ్డంకిగా మారతుంది. 50 ఎంఎల్‌డీల ఎస్టీపీని నిర్మించాలంటే 60 ఎకరాలపైనే అవసరమవుతుంది.

 

50 ఎంఎల్‌డీల ఎస్టీపీకి కనీసం 30 ఎకరాల స్థలం కావాలి. ఎక్కడికక్కడి నాలాలపై నిటారుగా వర్టికల్ ఎస్‌టీపీలను ఏర్పాటు చేయడం ద్వారా స్థలం కొరతను అధిగమించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నాలాలపైనే ఎస్టీపీలు చేపట్టాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ తరుణంలో థాయ్‌లాండ్ తరహాలో ఎస్టీపీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో ఒక్కో ఎస్టీపీ నాలుగు, అయిదు అంతస్తుల్లో ఉంటాయి. నాలాల ఎగువ నుంచి వచ్చే మురుగును ఈ ఎస్టీపీల్లోకి పంపి శుద్ధి చేసిన తర్వాత కిందకు వదిలేస్తున్నారు. ఈ వినూత్న తరహా విధానాన్ని ఇక్కడ తొలుత ఫతేనగర్ నాలాపై చేపట్టాలని అంచనా వేస్తున్నారు. ఫతేనగర్ వద్ద 20-30 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మించాలనే అధికారుల ఆలోచన త్వరలో కార్యరూపంలోకి రానుంది. ఇక్కడ విజయవంతమైతే ఇతర ప్రాంతాల్లోనూ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు.

 

 

సిండికేట్ గా బెల్లం వ్యాపారులు

Tags:Measures for construction of STPs in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *