మేడారం.. మహిమాన్వితం

వరంగల్, ఫిబ్రవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అడుగడుగునా అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. గద్దెల వద్ద జువ్విచెట్టు, చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్టలు, సన్నని నీటిధారలు, సమ్మక్క రాకకు ముందు పూజారుల చేతుల్లో వెలుగురేఖలు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాతరలో ప్రతి ఒక్కటీ అద్భుతమే. మాఘశుద్ధ పౌర్ణమికి సమ్మక్క జాతర జరగాలని ఎప్పటినుంచో సంప్రదాయం ఉంది. ఈ సంవత్సరం బుధవారం నుంచి జాతరను మొదలవుతుంది. పున్నమ వెలుగుల్లో గిరిదేవతల కాంతులు వికసిస్తాయి. ఇక సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్విచెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమీయడమే కాకుండా సమ్మక్కను మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తుంటాడని ప్రతీతి. అయితే పగిడిద్దరాజు తన వద్దకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడనే ఉద్దేశంతో సమ్మక్కతల్లి భర్తకు కళ్లు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టు పైన ఉంచిందంటారుసమ్మక్క కుంకుమభరిణె ఉండే ప్రాంతం చిలుకలగుట్ట.

అత్యంత మహిమాన్వితమైనదిగా భావించే ఈ గుట్ట చుట్టూ తేనెటీగలు కాపలా ఉంటాయి. ఆ ప్రదేశంలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే తేనెటీగలు వెంటబడి తరుముతాయని ఆదివాసీల విశ్వాసం. మరోవైపు చిలుకలగుట్టపై నుంచి రెండు సన్నని జలధారలు నిరంతరాయంగా ప్రవహిస్తున్నాయి. సమ్మక్క, సారలమ్మల జలధారలుగా చెప్పే ఈ నీటిని తాగితే సమస్తరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. సమ్మక్కను తీసుకొనిరావడానికి ఒకరోజు ముందు చిలుకలగుట్టపైకి వెళ్లే పూజారుల చేతుల్లో ఓ కాంతిరేఖ వచ్చిపడుతుందని అదే సమ్మక్క ప్రతిరూపంగా పూజారులు చెబుతారు. జాతరలో అత్యంత ముఖ్యమైనది మూడోరోజే.. ఆ ఒక్క రోజే 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకుంటారు.. మొక్కుబడులు.. ఎదురుకోళ్లు..  పొర్లుదండాలు.. జంతుబలులు.. శివసత్తుల పూనకాలతో అడవంతా హోరెత్తిపోతుంది.. జాతరకు వచ్చే భక్తులు తమ ఇలవేల్పులను వారి వారి పద్ధుతుల్లో కొలుస్తుంటారు.. తమ ఈతిబాధలు తీర్చాలంటూ వనదేవతలను ఒక్కొక్కరు.. ఒక్కో పూజావిధానంతో వేడుకుంటారు.

Natyam ad