Natyam ad

వైద్యకళాశాల భవనాలను త్వరగా పూర్తిచేయాలి-జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్

విజయనగరం ముచ్చట్లు:

ప్రభుత్వ వైద్యకళాశాల భవనాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. స్థానిక ట్రైబల్ యూనివర్సిటీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ఆమె గురువారం  ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, సెమినార్ హాలు, హాస్టల్ తదితర భవనాల నిర్మాణాన్ని, వాటి నాణ్యతను, ఇతర సదుపాయాల కల్పనను పరిశీలించారు.  ఇప్పటివరకు జరిగిన ఖర్చు, చేసిన పనులు, బిల్లుల పరిస్థితి, సిమ్మెంట్, ఐరన్, ఇసుక సరఫరా, పనివారి సంఖ్య తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు.  ఎపి ఎంఎస్ఐడిసి అధికారులు ఆయా భవనాల పురోగతిని కలెక్టర్కు వివరించారు. తరగతి గదుల నిర్మాణం పూర్తి అయ్యిందని, విద్యుత్ వైరింగ్, ప్లంబింగ్, ఫ్లోరింగ్, వెలుపల గోడలకు ప్లాస్టింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. మరో రెండు నెలల్లో పనులను పూర్తి చేస్తామని చెప్పారు. కళాశాలకు నీటి సదుపాయం కోసం సంప్ట్యాంకును నిర్మించామని, తాత్కాలికంగా మున్సిపాల్టీ నుంచి రోజుకు సుమారు 35వేల లీటర్ల నీటిని ఇప్పించాలని అధికారులు కోరారు. మెడికల్ కాలేజీకి నీటి అవసరాలను శాశ్వతంగా కల్పించేందుకు చంపావతి నదినుంచి పైప్లైన్ వేసేందుకు రూ.10కోట్లు ఖర్చుతో ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయని వివరించారు.

 

 

కలెక్టర్ నాగలక్ష్మి స్పందిస్తూ, మున్సిపాల్టీనుంచి తాత్కాలికంగా నీటిని ఇప్పించేందుకు వెంటనే సంబంధిత అధికారులతో చర్చిస్తానని చెప్పారు. శాశ్వత పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తరగతి భవనాల నిర్మాణం దాదాపు పూర్తి అయినప్పటికీ, ఇతర పనులు పెండింగ్ ఉన్నాయని, వాటిని పూర్తిచేసేందుకు నిపుణులైన పనివారి సంఖ్యను పెంచాలని సూచించారు.  భవన నిర్మాణ పనులను, రహదారిని వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పద్మలత, ఎపిఎంఎస్ఐడిసి సూపరింటిండెంట్ ఇంజనీర్ అంకమ్మ చౌదరి, ఇఇ సత్య ప్రభాకర్, విశాఖ ఎస్ఈ శివశంకర్, తాశిల్దార్ సిహెచ్.బంగార్రాజు, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Medical college buildings should be completed soon-District Collector Nagalakshmi.S

Post Midle