విజయనగరానికి మెడికల్ కాలేజీ
విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. త్వరలోనే జిల్లాలో మెడికల్ కాలేజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి వైద్య కళాశాల లో తరగతులు నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి వెల్లడించారు. మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 150 సీట్లతో ఎం.బి.బి.ఎస్. ప్రథమ సంవత్సరం తరగతులు మంజూరు చేసేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ ప్రవేశాలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఏపీలో కొత్తగా 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు కాగా, అందులో అనుమతులు పొందిన ఫస్ట్ కాలేజీ విజయనగరం జిల్లాదే. జాతీయ మెడికల్ కమిషన్ బృందం ఫిబ్రవరి 3న వైద్య కళాశాల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి వెల్లడించారు. ఇప్పటికే రూ.500 కోట్ల వ్యయంతో వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో వైద్య కళాశాల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తాత్కాలికంగా ప్రారంభించేందుకు, జిల్లా సర్వజన ఆసుపత్రిలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసుపత్రిలో ఆధునిక వసతులను కల్పించడంతో పాటు హాస్పిటల్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు.
మొత్తం 30 పడకలతో ఎన్ఐసియు, ఐసియు, ఎస్ఐసియు సదుపాయాలను ఏర్పాటు చేశారు. గ గర్భిణులు, చిన్న పిల్లల కోసం ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. సుమారు 8.6 కోట్ల రూపాయల ఖర్చుతో అవసరమైన భవనాలను నిర్మించి, వసతులను కల్పించారు. వాటితో పాటు ఔట్ పేషెంట్ రిజిష్ట్రేషన్ రూమ్, లెక్చర్ గ్యాలరీని నిర్మించడంతో పాటు ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు, ఇతర సిబ్బంది నియామకాలను దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి విడదల రజని ఇటీవల పరిశీలించారు. రాష్ట్రంలో మొత్తం 16 ప్రభుత్వ కాలేజీలను మంజూరు చేయగా, అనుమతి లభించిన తొలి ప్రభుత్వ మెడికల్ కాలేజీగా విజయనగరం కాలేజీ నిలిచింది. గాజులరేగ వద్ద రూ.500 కోట్లతో వైద్య కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. సుమారు 35 కోట్ల రూపాయలతో, పీవీబీ స్టక్చర్ విధానంలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ భవనాన్ని త్వరలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త మెడికల్ కాలేజీ పనులు త్వరలోనే పూర్తి చేసి కొత్త కాలేజీ భవనం నుంచే ఎంబీబీఎస్ తొలి ఏడాది విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు.

Tags; Medical College for Vizianagaram
