సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటి
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, వారు బాగుంటే ప్రజలు బాగుంటారు
60రోజుల్లో క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు అమలు: సీఎం
తాడేపల్లి ముచ్చట్లు:

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ని ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం కలిశారు. కొత్తగా జీపీఎస్ ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, వారు బాగుంటే ప్రజలు బాగుంటారు: సీఎంప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములని, ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని సీఎం వారికి చెప్పారు. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. అందుకే పెన్షన్ సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపనపడ్డామని.. గతంలో ఎవ్వరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి,
అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందన్నారు. దీన్ని దష్టిలో ఉంచుకుని జీపీఎస్ ను తీసుకువచ్చామన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్ ను రూపొందించామని.. 62 ఏళ్లకు రిటైర్ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామన్నారు. ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలన్నారు. అయితే ఉద్యోగుల విషయంలో కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను అరవై రోజుల్లో అమలు చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.
సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయని జగన్ చెప్పారు. రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘకసరత్తు చేసిందని, దీని ఫలితంగానే జీపీఎస్‌ను రూపకల్పన చేశామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశామని.. సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణలోకి తీసుకున్నామన్నారు. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశామన్నారు. అలాగే వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేసి.. వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతం: ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి
పీఆర్‌సీ కమిషన్ వేసినందుకు సీఎంజగన్‌కు ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ హయాంలో పీఆర్‌సీ కమిషన్ అడిగినందుకు గుర్రాలతో తొక్కించారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఇచ్చిన మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని అన్నారు. సీఎం జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వస్తాయని తెలిపారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవని శివారెడ్డి అన్నారు.
Tags:Meeting of trade unions with CM Jagan
