మేకపాటి విక్రమ్… పూలబాటేనా

నెల్లూరు ముచ్చట్లు:

మేకపాటి విక్రమ్ రెడ్డి.. ఇంతకు ముందెన్నడూ రాజకీయంగా వినపడని పేరు.. విక్రమ్ గతంలో ఎప్పుడూ కనపడని బొమ్మ.. అయితే..  ఆ పేరు తండ్రి, అన్నలా మారుమోగుతుందా.. మేకపాటి వారసుడు అన్నంత ఘనంగా బొమ్మ పలికిస్తుందా.. అనే ఊగిసలాట అందరి మదిలో కనిపిస్తోంది. మేకపాటి కుటుంబ వారసుడిగా విక్రమ్ రెడ్డి రాణిస్తారా.. లేదా.. ?!మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆ కుటుంబంలో కొంత రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి వారసుడు ఎవరనేది నిన్నటి వరకు క్లారిటీ లేక అటు అత్మకూరు నియోజకవర్గం ప్రజల్లో.. ఇటు వైసీపీ కార్యకర్తల్లో కొంత నైరాశ్యం కనబడింది. కొంత కాలం క్రితం మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తిరెడ్డి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ దాన్ని కొట్టిపారేసేందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి తన రెండో కుమారుడు విక్రమ్ వస్తున్నాడని ప్రకటించారు. అయినా అది జరుగుతుంతో లేదో అని ఎక్కడో కొంత అనుమానం కార్యకర్తల్లో కలిగింది. ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ.. జగన్ దగ్గర విక్రమ్ అభ్యర్ధిత్వాన్ని తెలియజేసి నియోజకవర్గంలో ప్రజలతో పాటు జిల్లాలో మరోసారి మేకపాటి ముద్ర పడేలా చేశారు మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి. తన వారసుడు ఎవరనే ఇంతకాలం వచ్చిన అనుమానాలపై క్లారిటీ వచ్చేలా మేకపాటి వారసుడు విక్రమ్ అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.

 

 

 

మేకపాటి కుటుంబంలో రాజకీయ వారసుడొచ్చాడు సరే.. మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి ఆశయాలు, తండ్రి రాజమోహన్ రెడ్డి కలను విక్రమ్ రెడ్డి నెరవేరుస్తాడా? అనేదే ప్రస్తుతం తెరమీదకి వస్తున్న ప్రశ్న. విక్రమ్ రెడ్డి గత 30 సంవత్సరాలుగా ఏనాడూ బయటకురాని వ్యక్తి, తండ్రి, రాజమోహన్ రెడ్డి, అయిదుసార్లు ఎంపీ అయినా.. చిన్నాన్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా.. అన్న గౌతమ్ రెడ్డి మంత్రి అయినా విక్రమ్ రెడ్డి రాజకీయాల వైపు ఎనాడూ కన్నెత్తి కూడా చూడలేదు. రాజకీయంగా ఓనమాలు తెలియని వ్యాపారవేత్త విక్రమ్ రెడ్డి. అనుకోకుండా రాజకీయ అరంగేట్రం చెయ్యడంతో కార్యకర్తల్లో తెలియని ఏదో ఆందోళన ఒక వైపు వెంటాడుతోందట. విక్రమ్ రెడ్డి అందరినీ గుర్తుపట్టి గుర్తింపు ఇచ్చేలోపే మిగిలిన రెండేళ్ల పుణ్యకాలం కాస్తా పూర్తవుతుందనే భయం పార్టీ శ్రేణుల్లో మరోవైపు వెంటాడుతోందట.అన్న గౌతమ్ రెడ్డి మూడేళ్లు మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు ప్రాంతానికి ఏమీ చేయకపోగా  కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదట. మంత్రిగా ఉండి ఏమీ చేయలేని గౌతమ్ రెడ్డి.. ఇప్పుడు ఆయన తమ్ముడు విక్రమ్ ఎమ్మెల్యే అయి ఏంచేస్తాడని శ్రేణులు అనుమానాలు వ్యకత్ం చేస్తున్నారట. ఈ మధ్య కాలంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం బ్యారేజీని పరిశీలించడానికి కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లారు. అయితే అక్కడ కాకాణికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి బొమ్మ కూడా అక్కడి నాయకులు వేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

 

 

Post Midle

సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ పేరు పెట్టాలని స్యయానా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇప్పుడు సంగం బ్యారేజి ప్రాంతానికి మంత్రి కాకాణి వెళితే అక్కడ గౌతమ్ రెడ్డికి వైసీపీ నేతలు ప్రాధాన్యం ఇవ్వలేదనే పలువురు ఎత్తిచూపుతున్నారు. దీన్ని బట్టి ఆ నియోజకవర్గంలో మేకపాటి కుటుంబం గ్రాఫ్ పడిపోతోందని అర్థమవుతుందంటున్నారు.ఉప ఎన్నికల్లో సాధారణంగా కొంత సింపతీ ఉంటుంది. ప్రస్తుతం ఆత్మకూరులో ఉన్న పరిస్థితి రీత్యా ప్రధాన ప్రతిపక్షం పోటీ పెడితే మేకపాటి విక్రమ్ ఎన్నికల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేదని వైసీపీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. చనిపోయిన కుటుంబంలో ఎవరైనా ఎమ్మెల్యే గా పోటీ చేస్తే టీడీపీ అక్కడ పోటీ చేయదని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఈ సాంప్రదాయం మంచిదని, అది తెలుగు దేశం పార్టీ పాటిస్తుందని చెప్పారు బాబుగారు. అందులో భాగంగానే కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయని వైనం ప్రస్తావించదగ్గ అంశం. జనసేన మద్దతుతో బీజేపీ పోటీ చేసినా దానికి డిపాజిట్ గల్లంతయిన విషయం తెలిసిందే. అయితే.. ఆత్మకూరులో టీడీపీ పోటీ చేస్తే పరిస్థితులు తారుమారవుతాయనే చర్చ జరుగుతోంది.ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ పెట్ఠినా ఓ మోస్తరు ఓట్లు మాత్రమే దానికి పడతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే కార్యకర్తల పరిచయ కార్యక్రమం మొదలెట్టిన విక్రం రాబోయే రోజుల్లో ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేసి, మేకపాటి అసలు సిసలు వారసుడు వచ్చాడు అనిపిస్తాడా..! లేక ఒక వ్యాపారిలా వ్యవహరించి మేకపాటి కుటుంబాన్ని రాజకీయంగా ఇరుకున పెడతారో తేలాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

 

Tags:Mekapati Vikram … Poolabatena

Post Midle
Natyam ad