తెలంగాణలో కలపండి
ఐదు గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్ ముచ్చట్లు:
భద్రాచలం వరదలు – పోలవరం డ్యాం వ్యవహారంలో ఏపీ, తెలంగాణ మధ్య మాటలయుద్ధం కొనసాగుతుండగా.. ఏపీలోని ఐదు గ్రామాలు కీలక తీర్మానం చేశాయి. తమను తెలంగాణలో కలపాలంటూ ఆయా గ్రామాల పాలక వర్గాలు గ్రామ పంచాయతీలో తీర్మానం చేశాయి. పురుషోత్తపట్నం, పిచుకలపాడు, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామాల పాలక వర్గాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విలీనం చేసిన 7 మండలాల పరిధిలో ఈ ఐదు గ్రామాలు ఉన్నాయి. విలీనం తర్వాత వీటిని తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా చేర్చగా.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన అనంతరం అల్లూరి మన్యం జిల్లాలో భాగంగా ఉన్నాయి. ఎటపాకను మండలంగా చేశారు. అయితే, జిల్లా కేంద్రం పాడేరు తమకు చాలా దూరంగా ఉందని ఈ ఐదు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. సరకులు, వైద్య చికిత్స, ఇతర అవసరాల నిమిత్తం తాము తరచూ భద్రాచలం పట్టణానికి వెళ్తామని చెబుతున్నారు.
ఏపీలో ఉన్నమాటే గానీ.. ఏ అవసరం వచ్చినా తెలంగాణకే వెళ్తున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం పట్టణానికి ముందు ముప్పు ఎక్కువైందని తెలంగాణ వాదిస్తోంది. ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. ఆ గ్రామాల్లో కరకట్టలు నిర్మించి, గోదావరి వరదలతో ముంపు ముప్పును తగ్గించే ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. ఆయా గ్రామాల ప్రజల కోరిక కూడా ఇదేనని అన్నారు. అయితే, ఎవరో ఐదుగురు గ్రామస్థులు చెబితే.. ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేస్తారా అంటూ ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. అంబటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఐదు గ్రామాల పంచాయతీ తీర్మానాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Tags: Merge in Telangana