ప్రైవేట్ ఏజెన్సీలకు మిడ్ డే మీల్స్

Mid Day Meals for Private Agencies

Mid Day Meals for Private Agencies

Date:21/11/2018
ఒంగోలు ముచ్చట్లు:
పద్దెనిమిది సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని దశలవారీగా వెళ్లగొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఏక్తా ఏజెన్సీ ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఆ ఏజెన్సీ వెనకడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిర్వాహకులు నిర్వహిస్తూ వస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోయినా, గౌరవ వేతనం నెలల తరబడి నిలిపి వేసినా తమకు ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతూ ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5,500 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఉన్నారు. పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. కోడిగుడ్లను ఏజెన్సీ ద్వారా అందిస్తోంది.తమ జీవనోపాధికి ఎలాంటి డోకా లేదనుకుంటూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న నిర్వాహకుల నెత్తిపై పాఠశాల విద్యాశాఖ పిడుగులు వేసింది.
ఏక్తా ఏజెన్సీ స్థానంలో తాజాగా అక్షయపాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో దశలవారీగా అక్షయపాత్రకు ఈ పథకాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద అద్దంకి, కొరిశపాడు మండలాల్లోని పాఠశాలల్లో వెంటనే మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగేలా చూడాలంటూ జిల్లా విద్యాశాఖాధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయాన్ని అక్షయపాత్ర నిర్వాహకులకు కూడా తెలియజేయడంతో వారు ఆ రెండు మండలాల్లోని పాఠశాలల వివరాలు, అందులో ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుంది లెక్కగడుతున్నారు. దీంతో ఆ రెండు మండలాలతోపాటు జిల్లాలోని మిగిలిన మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నా రు.
ముందు రెండు మండలాలు అని ప్రకటించి ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు.చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్న డైట్‌ ఛార్జీలను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కొంతమేర పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ పెంపు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎప్పటికైనా కొంత పెరుగుదల ఉంటుందన్న ఉత్సాహంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు విద్యార్థులకు భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు. అయితే, వారి ఆశలను అడియాశలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు భగ్గుమంటున్నారు. పెంపు పేరుతో తమను ఇంటికి పంపుతున్నారంటూ విమర్శిస్తున్నారు.
Tags:Mid Day Meals for Private Agencies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *