సొంత డబ్బులతో  మధ్యాహ్న భోజనం

Midday meal with own money

Midday meal with own money

Date:19/07/2018
బెంగళూర్ ముచ్చట్లు:
ఓ ప్రభుత్వ కాలేజీకి చెందిన లెక్చరర్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు సొంత డబ్బులతో ఉచిత మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేసి తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లా లోన్ గవర్నమెంట్ సైన్ కళాశాల గురువులు తమ విద్యార్థులకు విద్యాదానంతోపాటు అన్నదానం చేస్తూ దాతృత్వాన్ని మారుపేరుగా నిలుస్తున్నారు. రోజూ కనీసం 180 మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. గురువులు ప్రారంభించిన ఈ గొప్ప కార్యంతో కాలేజీలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మూడేళ్ల కిందట మొదలైన ఈ బృహత్తర కార్యక్రమంలో అధ్యాపక, భోధనేతర సిబ్బంది పాలు పంచుకుంటున్నారు. ప్రారంభంలో ఆహార పదార్థాలను బయట నుంచి తెప్పించేవారు. అయితే ఇటీవలే కాలేజీలో కిచెన్ ఏర్పాటుచేసిన అన్నం, సాంబారు వడ్డిస్తున్నారు. పండుగ సందర్భాల్లో ప్రత్యేకంగా పాయసం లాంటివి పిల్లలకు వడ్డించడం విశేషం. మూడేళ్ల కిందట కేవలం 80 మంది మాత్రమే భోజనం చేసేవారు.. ప్రస్తుతం వీరి సంఖ్య 180కి చేరుకుంది. ఈ కాలేజీలో పనిచేసే 50 మంది అధ్యాపకులు పేద విద్యార్థుల కోసం నెలకు ఒక్కొక్కరు రూ.2,000 కంటే ఎక్కువ మొత్తం విరాళంగా ఇస్తారు. ‘సంవేదన బలగ’ అనే గ్రూప్‌ను ఏర్పాటుచేసి, దీని పేరుతో బ్యాంకు ఖాతాను కూడా నడుపుతున్నారు. హసన్‌ ప్రాంతంలో ఏకైక ప్రభుత్వ కళాశాల కావడంతో చుట్టుపక్కల ఉన్న చిక్క‌మంగళూరు, మడికేరి, మాండ్య, మైసూరు జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే తరగతులు సాయంత్రం 5.30 గంటలకు వరకు సాగుతాయి.ఆర్థిక స్థోమత ఉన్న విద్యార్థులు హోటల్స్‌కు వెళ్లి భోజనం చేస్తారు. పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు, తరగతులకు కూడా కొనిసార్లు గైర్హాజరవుతుంటారు. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే పేద విద్యార్థులందరికీ ఈ ఉచిత మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్ గంగా గౌడ మాట్లాడుతూ.. మధ్యాహ్నం భోజనం తినకపోవడంతో పేద విద్యార్థులు అనారోగ్యం గురికావడం, తరగతులకు హాజరుకాలేని పరిస్థితి ఉండేదని, వీరికి భోజన వసతి కల్పిస్తే సహాయకారిగా ఉంటుందని భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.
సొంత డబ్బులతో  మధ్యాహ్న భోజనం https://www.telugumuchatlu.com/midday-meal-with-own-money/
Tags:Midday meal with own money

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *