వలసలు ఆగేనా..! 

Date:10/11/2018
జగిత్యాల ముచ్చట్లు:
గల్ఫ్, ముంబాయి వలసలకు కేరాఫ్‌గా పేరొందిన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 40వేల మంది పొట్టకూటి కోసం బయటిదేశాలకు వెళ్లారు. సుమారుగా అంతేమంది జిల్లా నుంచి ముంబాయికి వలసవెళ్లారు. అవసరాలు, పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు తమతమ స్వగ్రామాలకు వచ్చి వెళ్తుంటారు. ఏళ్లతరబడి ఈ రాకపోకల పరంపర కొనసాగుతోంది. అయితే.. వచ్చే నెల ఏడో తేదిన వీరి రాక కోసం వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆరోజు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వీరితోపాటు వీరి కుటుంబ సభ్యుల ఓట్లు తమకే పడేలా చర్యలు తీసుకుంటున్నారు. గల్ఫ్ బాధితులే లక్ష్యంగా జిల్లాలో ఎన్నికల ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్‌ మేనిఫెస్టోకు ఆకర్షితులై సుమారు 200 మంది గల్ఫ్‌ బాధిత కుటుంబాలు ఈనెల 4న.. జగిత్యాల మహాకూటమి అభ్యర్థి జీవన్‌రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. ఇటు టీఆర్‌ఎస్‌ సైతం ఇప్పటికే ప్రవాస పాలసీ అమలుపై చర్యలు తీసుకుంది. ఇప్పటికే నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో గల్ఫ్‌ సమస్యలపై స్పందించారు. ఈ క్రమంలో పరాయిదేశంలో చిక్కుకున్న, మృతిచెందిన వారికి తనవంతుగా సహాయం అందించారు. అన్ని పార్టీల అభ్యర్థులు తమ గెలుపునకు కలిసొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకుండా జాగ్రత్తపడుతున్నారు.
జిల్లా పరిధిలోని జగిత్యాల, రాయికల్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, సారంగాపూర్, ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరి చొప్పున సుమారు 40వేలకు పైగా మంది సౌదీఅరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమన్, కువైట్, ఖతర్‌ దేశాల్లో ఉంటున్నారు. ఎక్కువగా సౌదీ, దుబాయి, అబుదాబి, ఖతర్, షార్జాకు వెళ్తుంటారు.
వీరిలో మంచి హోదాలో ఉన్నవారు 4వేలకు మించి ఉండరు. మిగిలిన వారందరూ భవన నిర్మాణ కార్మికులుగా, వివిధ కంపెనీల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా, హోటళ్లలో పనిచేస్తున్నారు. వీరందరూ చాలీచాలని వేతనాలతోపాటు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరి సంక్షేమం కోసం ఎన్నో ఏళ్ల నుంచి అనేక హామీలు ఇస్తున్న ప్రభుత్వాలు.. అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
Tags; Migrants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *