తుర్కపల్లి నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి
తుర్కపల్లి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి వైపు దూసుకెళుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్, కలెక్టర్ పమెల సత్పతి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రతి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధివైపు పయనిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, ఇంటింటికి తాగునీరు వంటి సంక్షేమ పథకాలు తమ తమ రాష్ట్రాలలో సైతం అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్గా భావించడం ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరుకు నిదర్శనమని అన్నారు.
కొన్ని మతతత్వ పార్టీలు కులం, మతం పేరిట దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా లెక్క చేయకుండా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మనమంత అండగా నిలవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. గిరిజన ప్రాంతమైన తుర్కపల్లి మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే స్థలములో నూతన పోలీస్టేషన్ భవనాన్ని నిర్మించేందుకు కృషిచేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను ఆయన అభినందించారు. 1947 ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పటికీ సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, జడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, డిసిపి నారా యణరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, సర్పంచ్ పదాల వనిత శ్రీనివాస్, ఎంపిటిసి హనుమంత్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Tags; Minister Jagadishwar Reddy inaugurating the new police station building at Turkapally