Natyam ad

అమాత్య…భాగ్యం లేదా..?

విశాఖపట్టణం ముచ్చట్లు:
 
విశాఖజిల్లాలో పార్టీ పటిష్టతపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కాకుండా ఇక్కడ అధికారపార్టీకి 11మంది శాసనసభ్యుల బలం ఉంది. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపించినా.. రెండున్నరేళ్లు తిరిగే సరికి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణికి మధ్య గ్యాప్ పెరిగింది. పాయకరావుపేట, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో వ్యతిరేకత రోడ్డెక్కింది. మిగిలినచోట్ల చాపకింద నీరులా అసమ్మతి విస్తరిస్తోంది. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపించడంతో.. వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతంలో పార్టీ, కేడర్ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం మధ్య విభేదాలను సీరియస్‌గా పరిగణించి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానంఎమ్మెల్యే అమన్నాథ్‌ను అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఈ బాధ్యతలు అప్పగించడం వెనక బలమైన కారణాలు ఉన్నాయట. 2009 ఎన్నికల్లో అమర్నాథ్‌ అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ అధికారంలోకి రాకముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కాపు సామాజికవర్గానికి చెందిన నేత. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కాపు నాయకత్వం బలం ఎక్కువ. వీటన్నింటినీ బేరీజు వేసుకునే హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.వాస్తవానికి అమర్నాథ్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా బెర్త్‌ ఖాయమని ఎమ్మెల్యే అనుచరుల ధీమా. ఇంతలో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అనుచరులు డైలమాలో పడ్డారట. పార్టీ పదవిపై అమర్నాథ్‌ ఆలోచనలు ఎలా ఉన్నా.. కేడర్ మాత్రం తమ నేతకు మంత్రి పదవి ఉన్నట్టా.. లేనట్టా..? అని చెవులు కొరుక్కుంటోందట. డీలా పడిన వారికి ఎమ్మెల్యే సర్ది చెబుతున్నారట. చాలా జిల్లాల్లో మంత్రులే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నందున కొత్త పదవిని పాజిటివ్ సంకేతంగా చూడాలనేది పార్టీలో మరోవర్గం అభిప్రాయం. మిగిలిన జిల్లాల మాదిరిగానే ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్న అమర్నాథ్‌కు లక్ కలిసి వస్తుందనే చర్చ జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యేకు వచ్చిన ప్రమోషన్ ఎంత వరకు లాభం.. ఏ మేరకు నష్టం..? అనే తూకం వేసుకుని విశ్లేషించుకునే పనిలో పడింది కేడర్‌.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Minister … no luck ..?