స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించిన మంత్రి పుల్లారావు

 Date:15/08/2018
ఏలూరు ముచ్చట్లు:
జిల్లాలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులైన గద్దే వెంకటేశ్వరరావు, గరగ వెంకట రమణమ్మలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా సత్కరించారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెంనకు చెందిన గద్దే వెంకటేశ్వరావు, పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన గరగ వెంకట రమణమ్మలను మంత్రి దుశ్శాలువా, పూలమాలలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలోప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ , శాసనమండలి విప్ యం .ఎ .షరీఫ్, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ, పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు, జిల్లా కలెక్టరు డా.కాటంనేని భాస్కర్ , డిఐజి మూర్తి జిల్లాపరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు, శాసనసభ్యులు బడేటి కోటరామారావు, రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ అభివృద్ది సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, యస్‌పి రవిప్రకాష్, జాయింటు కలెక్టరు వేణుగోపాలరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి యన్.సత్యనారాయణ, ఆర్ డివో జి.చక్రధరరావు, తదితరులు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన బాల బాలికలకు ఈ ప్రదర్శనలో పాల్గోని, ప్రేక్షకులను అబ్బురపరిచే రీతిలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు. తొలుత కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలకు చెందిన కస్తూరిబా బాలికల విద్యాలయం విద్యార్దినులు ప్రదర్శించిన “ఆగష్టు 15 నేడేనోయ్ ” సాంస్కృతిక కార్యక్రమంతో ప్రదర్శనలు ప్రారంభంకాగా, ఏలూరుకు చెందిన శ్రీ శర్వాణీ విద్యా ప్రాంగణంకు చెందిన 100 మంది విద్యార్దినీ విద్యార్దులు ప్రదర్శించిన “ ఏ దేశ మేగినా, ఎ ందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎ వ్వరెదురైనా పొగడరా నీ జాతి నిండు గౌరవమును” అంటూ ప్రదర్శించిన దేశ భక్తితో కూడిన నృత్యరూపకం ఆహూతులను అలరించింది.
ఏలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్దినులు ప్రదర్శించిన “మూడు రంగుల జెండా” నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భోగాపురం విజ్ఞాన్ గ్లోబల్ పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్దినీ విద్యార్దులు ప్రదర్శించిన “వందనాలు – వందనాలు వీర భారతి పుత్రుల విజయగాధరా ” అంటూ ప్రదర్శంచిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రదర్శించిన “హమ్ ఇండియా వాలే ” అంటూ ప్రదర్శించిన దేశ భక్తి నృత్యం ప్రేక్షకులను అలరించింది. ఏలూరు సర్.ఆర్..రెడ్డి పబ్లిక్ స్కూల్‌కు చెందిన 80 మంది విద్యార్దినీ విద్యార్దులు “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయశి ” అంటూ దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
తెల్లంవారిగూడెంకు చెందిన గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలకు చెందిన విద్యార్దినీలు, పశ్చిమ ఏజెన్సీకి చెందిన పలువురు గిరిజనులు గిరిజన సాంప్రదాయ “ధింసా” , “కొమ్ము ” నృత్యం గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో ఈ ప్రదర్శనకు మరింత శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శించిన అన్ని పాఠశాలల విద్యార్దులకు మంత్రి పుల్లారావు ప్రశంసాపత్రాలను అందజేశారు.
Tags:Minister Palla Rao who honored freedom fighters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *