అటవీశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం
– రాష్ట్రంలోని జూపార్క్ ల అభివృద్దిపై సమీక్ష
– త్వరలో విశాఖ, తిరుపతి జూపార్క్ లకు డైరెక్టర్ల నియామకం
– యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంపై దృష్టి పెట్టాలి
– జూపార్క్ ల అభివృద్ధికి డిపిఆర్ లను సిద్దం చేయాలి
– యానిమల్ అడాప్షన్ పై కంపెనీలను ప్రోత్సహించాలి
– జంతువులకు ఇచ్చే ఆహారం, వాటి ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ
అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి జూపార్క్ లను మరింత అభివృద్ధి చేసేందుకు వెంటనే డిపిఆర్ లను సిద్దం చేయాలని రాష్ట్ర అటవీ, ఇంధన, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని అరణ్యభవన్ లో గురువారం అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జూపార్క్ ల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు.రాష్ట్రంలోని జూపార్క్ లను మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దడంపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. తిరుపతి, విశాఖ జూలకు ప్రభుత్వం ప్రత్యేకంగా డైరెక్టర్ లను నియమిస్తోందని, వారి ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జూ పార్క్ ల్లో కొత్త జంతువులను ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా సమకూర్చుకోవాలని కోరారు. దేశంలోని ఇతర జూలను సందర్శించి, అక్కడ అమలు చేస్తున్న మెరుగైన విధానాలను అధ్యయనం చేయాలని అన్నారు. జూల అభివృద్దికి సంబంధించి డిపిఆర్ లను తయారు చేసుకుని, సెంట్రల్ జూ అథారిటీ నుంచి అవసరమైన అనుమతులను తీసుకోవాలని కోరారు.
జూలో సంరక్షిస్తున్న జంతువులకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలని, దీనిని పర్యవేక్షించేందుకు వెటర్నరీ యూనివర్సిటీ కాలేజీల్లోని నిపుణుల సహకారం తీసుకోవాలని కోరారు. అదే క్రమంలో జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. జూ పార్క్ లకు సందర్శకుల నుంచి వచ్చే ఆదాయంకు ఆదనంగా ఆర్థిక వనరులను సమీకరించుకునేందుకు సిఎస్ఆర్ నిధులను తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికే జంతువులను దత్తత తీసుకునే విధానం అమలులో ఉందని, విశాఖ, తిరుపతి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు, కంపెనీలను ఇందుకు ప్రోత్సహించాలని అన్నారు. ఇందుకోసం త్వరలోనే పరిశ్రమల నిర్వహాకులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే జంతుప్రదర్శన శాలల్లో సదరు కంపెనీల అడ్వర్టైజ్ మెంట్ ద్వారా కూడా ఆదాయం లభిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, వన్యప్రాణి విభాగం అడిషనల్ పిసిపిఎఫ్ శాంతిప్రియా పాండే, తిరుపతి సిఎఫ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags:Minister Peddireddy Ramachandra Reddy’s meeting with Forest Department officials
