అమర పోలీసులకు మంత్రి పినిపే నివాళులు
అమలాపురం ముచ్చట్లు:
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది.
ముందుగా మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు..తర్వాత అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అతిధులు మాట్లాడారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ 1959, లడక్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ సరిహద్దును పరిరక్షిస్తున్న భారతదేశ పోలీసుల మీద చైనా బలగాలు చేసిన దాడిలో పది మంది పోలీసులు దుర్మరణం పాలయ్యారని నాటి నుంచి విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ రోజు దేశ ప్రధాని మొదలు, రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం వారి మరణానికి విచారం వ్యక్తం చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. దేశ సరిహద్దులను కేంద్ర పారా మిలిటరీ బలగాలు రక్షిస్తే దేశ అంతర్గత భద్రత విషయంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గడిచిన సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా 188 మంది పోలీసులు వివిధ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారని , వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags: Minister Pinipe’s Tribute to Immortal Police
