ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్
కాకినాడ ముచ్చట్లు:
గ్రామస్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్(కుటుంబ డాక్టర్) విధానాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ విధానం ద్వారా ఇంటి వద్దే వైద్య సేవలు అందుకోవచ్చని జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా తెలిపారు.జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా.. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబుతో కలిసి కాకినాడ గ్రామీణ మండలం, వాకలపూడి సచివాలయం-3 పరిధిలో ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(పీహెచ్సీ) విలేజ్ క్లినిక్లను అనుసంధానం చేసి గ్రామస్థాయిలో ప్రతి కుటుంబం ఆరోగ్య పరిస్థితిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇదివరకు పీహెచ్సీల్లో ఒక వైద్యాధికారి మాత్రమే అందుబాటులో ఉండేవారని, ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా జిల్లాలో ఉన్న 40 పీహెచ్సీల్లో రెండో వైద్యాధికారిగా 87 మంది డాక్టర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని కలెక్టరు తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా రెండో వైద్యాధికారి తమ షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు ఒక గ్రామంలో 104 వాహనంతో సచివాలయం దగ్గరలో ఉన్న విలేజ్ క్లినిక్ వద్ద మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ వైద్య క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఈ వైద్య క్యాంపు అనంతరం గ్రామంలో ఉన్న పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా వైద్యాధికారి సందర్శించాలన్నారు. 104 వాహనంలో 75 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. అదేవిధంగా 14 రకాల వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించడంతో పాటు వివిధ వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన 30 రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంలో భాగంగా జిల్లాలో గత అక్టోబర్ నెలలో పైలెట్ ప్రాజెక్టు కింద సుమారుగా 1.35 లక్షల మందికి వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ఈ నూతన విధానంకి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం, వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు వైద్య అధికారి వద్ద ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు కృతికా శుక్లా సూచించారు.

శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి కుటుంబానికి వైద్యుడిని అందుబాటులో ఉంచడంతోపాటు ఇంటి వద్దే వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ ఫిజీషియన్ విధానానికి శ్రీకారం చుడడం జరిగిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించిన నాటి నుంచి వైద్య విద్య రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి, అనేకమైన సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో వైద్యశాలను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ నూతన విధానంపై ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు వైద్య అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం నూతన 104 వాహనాన్ని కలెక్టరు, ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ఆర్. రమేష్, డీఎల్డీవో పీ.నారాయణ మూర్తి, వైద్య సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags; MLA, Collector who started the family physician system
