ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదు

 Date:17/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
కాంగ్రెస్‌ నేతలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై తెలంగాణ అసెంబ్లీ విధించిన బహిష్కరణ వేటును రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎత్తేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీచేసింది. వారు తప్పు చేశారని భావిస్తే.. ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ, అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం సరికాదని ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. సరైన ఆధారాలుంటే వారిపై కేసు నమోదు చేయొచ్చని సూచించింది.తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేశారు. గవర్నర్‌ ప్రసంగం ప్రతులను చించేశారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్‌ఫోన్‌ను విసరగా అది శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆయన సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సభలో క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌పై బహిష్కరణ విధించింది. వారి శాసన సభ్యత్వాలు రద్దయినట్లు జీవో జారీచేసింది. మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యేల బహిష్కరణతో ఖాలీ అయిన నల్గొండ, అలంపూర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా జానా రెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు వేసింది.బహిష్కరణ ఉదంతంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కోర్టుకు తెలిపారు. దీనిపై పలుమార్లు వాదనలు విన్న హైకోర్టు కాంగ్రెస్‌ సభ్యులకు ఊరట కలిగించేలా తీర్పు వెలువరించింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లు యథావిథిగా తమ పదవుల్లో కొనసాగొచ్చని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
Tags:MLA’s suspension is invalid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *