నత్తనడకన ఆధునీకీకరణ పనులు

Date:14/09/2018
 మెదక్‌ ముచ్చట్లు:
 విద్యుత్ సరఫరాలో సమస్యలు తొలగించి మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ సర్కార్ ఆధునికీకరణ చేపట్టాలని గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు చర్యలూ తీసుకుంది. అయితే మోడ్రనైజేషన్ పనులు ఆశించినంత వేగంగా సాగలేదన్న విమర్శలు మెదక్ జిల్లాలో వినిపిస్తున్నాయి. మెదక్‌, చేగుంట పట్టణాల పరిధిలో విద్యుత్‌కు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయన్న కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి.
నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో పురోగతి లేదని పలువురు విమర్శిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు కూడా పనులపై శ్రద్ధ పెట్టడంలేదని మండిపడుతున్నారు. ఆధునికీకరణ సంబంధించిన వివిధ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
మెదక్‌, చేగుంట పట్టణాల్లో విద్యుత్తు సరఫరాను మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ స్కీం (ఐపీడీఎస్‌) కింద నిధులు కేటాయించింది. ఇందుకు రూ.12 కోట్లు నిధులను మంజూరు చేసింది.
గత జనవరిలో ఈ నిధులను కేటాయించగా పనులు చేపట్టేందుకు ట్రాన్స్‌కో అధికారులు టెండర్లు పిలిచారు. రెండు చోట్లా వేర్వేరు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. ఇంతరవరకూ బాగానే ఉన్నా పనులే వేగవంతంగా సాగడంలేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. మెదక్, చేగుంటల్లో
పట్టణ పరిధి విస్తరిస్తోంది.
దీంతో విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. వినియోగం పెరగడంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఐపీడీఎస్‌ ద్వారా పనులు చేపడుతున్నారు.ప్రస్తుతం పట్ణణంలో 153 నియంత్రికలు ఉన్నాయి. వీటి ద్వారా విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. రానున్న పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్తు విభాగంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఐపీడీఎస్‌ ద్వారా కొత్తగా 40
నియంత్రికలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 20 నియంత్రికలనే ఏర్పాటు చేశారు.
అయితే వాటికి కనెక్షన్‌ ఇవ్వలేదు. కొన్నిచోట్ల విద్యుత్తు స్తంభాలను పాతి వదిలేశారు. మరోవైపు 10 నియంత్రికల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉండగా ఇంతవరకు వాటిని పట్టించుకున్న నాథుడే లేడని స్థానికులు అంటున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి పనులు చేపట్టకపోవడం కొత్త సమస్యలకు తావిస్తోంది.
ఎందుకంటే పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. విద్యుత్‌సంబంధిత పనులూ సాగుతుండడంతో రహదారి పనులకు ఆటంకం ఏర్పడుతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీడీఎస్‌ ద్వారా జిల్లా కేంద్రం మెదక్‌లో చేపట్టిన పనులకు ఆటంకం నెలకొందని అంటున్నారు. కొత్తగా 40 నియంత్రికలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆయా ప్రాంతాల్లో దిమ్మెలు నిర్మిస్తుండగా పలుచోట్ల నిర్మించిన దిమ్మెలను స్థానికులు కూల్చివేస్తున్నారు.
తమ ఇళ్ల ముందు నియంత్రికల ఏర్పాటు వద్దని చెబుతూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఐదు దిమ్మెలనుకూల్చివేశారని ట్రాన్స్‌కో అధికారులు వివరించారు. ఏదేమైనా మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తుచ తప్పకుండా కార్యరూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
సంబంధిత అధికారులు ఈ విషయమై దృష్టిసారించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అంతా కోరుతున్నారు.
Tags: Modernization works on the plate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *