తెలుగు రాష్ట్రాల్లో  మోడీ మూడు రోజులు…

విజయవాడ ముచ్చట్లు:


ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల మొదటి వారంలో ఏకంగా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ వేదికగా జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరౌతారు. ఆ మరునాడు అంటే జులై 4న ఏపీలో పర్యటించనున్నారు. మంగళగిరిలో ఆయన ఎయిమ్స్ ను ప్రారంభిస్తారు.ప్రధాని ఏకంగా మూడు రోజులు తెలుగు రాష్ట్రాలలోనే మకాం వేయనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణను  వేదిక చేసుకుంది. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా పార్టీ అగ్రనేతలంతా హాజరు కానున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి తెలంగాణలో కమల వికాసం దిశగా వారిని కార్యోన్ముఖలను చేయడానికి అవసరమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో కూడా బీజేపీ బలోపేతం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సొంతంగా బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఏ పార్టీనీ, ఏ వ్యక్తినీ పార్టీ భుజాన మోయదంటూ బీజేపీ జనసేనకు స్పష్టత నిచ్చింది. మోడీ రాష్ట్రపర్యటనకు ప్రాధాన్యత వచ్చింది.

 

 

ఏపీ గడ్డపై నుంచి రాష్ట్ర బీజేపీ సేనలకు ఆయన ఏం చెబుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన ఉంది. అయితే పర్యాటకులు మాత్రం రాష్ట్రపతి ఎన్నికలో బీజేపి అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం ఖరారైనప్పటికీ, మరో సారి అదే విషయమై జగన్ తో చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు.  మొత్తం మీద దక్షిణాదిలో బలోపేతం కావాలన్న బీజేపీ యత్నాలకు అనుగుణంగానే ప్రధాని, హోంమంత్రి సహా కమలం పార్టీ  నే తలు ఒక్కరొక్కరుగా తెలుగు రాష్ట్రాలకు క్యూ కడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే  మోడీ వరుసగా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పర్యటన ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణలో రెండు రోజులు మకాం వేయనున్నారు. ఆ సందర్భంగా తెలంగాణలో పార్టీ బూత్ స్థాయిలో బలోపేతం అయ్యేలా క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడంతో పాటు ఏపీకి చెందిన పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. ఏపీలో కూడా ముందస్తు అంచనాల నేపథ్యలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు.. పార్టీకి నష్టం వాటిల్లకుండా, పొత్తుపొడుపుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.ఎవరెన్ని చెబుతున్నా ఏపీలో బీజేపీకి వైసీపీకి మైత్రి బహిరంగ రహస్యమే.

 

 

Post Midle

ఆ కారణంగానే తన మిత్రుడికి మేలు కలిగేలా రాష్ట్రంలో విపక్షాల ఐక్యతకు గండి కొట్టేలా రాష్ట్రంలో కమలం నాయకత్వం వ్యవహరిస్తున్నది. వైసీపీ బలం పెచ్చు చేసి చూపుకునేందుకు వీలుగా ఆత్మకూరు ఉప ఎన్నికలో అభ్యర్థిని పోటీకి నిలిపిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో మోడీ ఏపీ పర్యటన సందర్భంగా అధికార పార్టీపై విమర్శల మరకలు కాకుండా ప్రశంసల మెరుపులు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మద్దతుకు సంబంధించిన మంతనాలకే మోడీ ఏపీ పర్యటన పరిమితమయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయంటేన్నారు.  నిన్న గాక మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తినలో పర్యటించి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆ భేటీ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ.. ఇరువురి మధ్యా చర్చ ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడంపైనే జరిగిందని ఇరు పార్టీల నాయకులూ కూడా ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు.అంతకు మించి ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి డిమాండ్లేవీ జగన్ మోడీ ఎదుట ఉంచలేదని కూడా అంటున్నారు. అయితే రాష్ట్రంలో షో రన్ చేయడానికి, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మరింత అప్పు మంజూరు చేయాలని జగన్ ప్రధానిని కోరారనీ, అందుకు మోడీ సానుకూల స్పందన ఫలితమే.. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టుకుని రుణం పొందేందుకు ఆర్బీఐ అంగీకరించడమని చెబుతున్నారు. అదనపు రుణాన్ని అందించినందుకు మోడీకి జగన్ కృతజ్ణతలు తెలపడం వినా మోడీ రాష్ట్ర పర్యటన వల్ల ఒరిగేది, ఒనగూడేదీ ఏమీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

Tags: Modi for three days in Telugu states …

Post Midle