71 వేల మందికి నియామక పత్రాలు అందచేసిన మోడీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రోజ్‌గార్ మేళాలో కొత్తగా నియమితులైన 71 వేల మంది అభ్యర్థులకు అపాయిట్మెంట్ లెటర్స్‌ను పంపిణీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పలు రాష్ట్రాల అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు ‘కర్మయోగి ప్రారంభ్’ మాడ్యూల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. యువతను మరింత శక్తివంతం చేయడానికి, దేశాభివృద్ధిలో వారిని భాగం చేయడానికి రోజ్‌గార్ మేళాను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నామని చెప్పారు. రోజ్‌గార్ మేళాల ద్వారా ఎంపికైన యువత ప్రభుత్వ ప్రతినిధులుగా ఉంటారని.. ప్రభుత్వంలో సామర్థ్యాలను పెంచడానికి వారంతా కష్టపడి పని చేయాలని ప్రధాని కోరారు. దేశం అమృతకాలంలోకి ప్రవేశించిందని..

ఈ యుగంలో కొత్త బాధ్యతను పొందుతున్నానరంటూ తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలో యువత రథసారథిగా మారుతారని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు.ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ‘రోజ్‌గార్ మేళా’ (ఉపాధి మేళా) ను ప్రారంభించింది. నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రధాని నరేంద్ర మోడీ.. అంతకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్రం చర్యలు చేపట్టింది. రోజ్‌గార్ మేళా చేపట్టి ఎంపికైన అభ్యర్థులకు వెనువెంటనే నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లను సైతం చేసింది.నిరుద్యోగులు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు రోజ్‌గార్ మేళా దోహదపడుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ నెలలోనూ ఇదే పద్ధతిలో రోజ్‌గార్ మేళా కింద 75 వేల మంది అభ్యర్థులకు కేంద్రం నియామక పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే.
Tags: Modi gave appointment documents to 71 thousand people
