Natyam ad

మోడీ సభ విజయవంతం

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ జన సముద్రాన్ని తలపించింది. ఏకంగా 10,742 కోట్ల విలువైన ఏడు కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విశాఖ వేదికగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఒకే వేదికపై నుంచి బృహత్తర కార్యక్రమాలను ప్రారంభించారు.ఏయూ మైదానం వేదికగా జరిగిన ఈ కార్య క్రమంలో ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఇంధన తయారీ, వినియోగంలో స్వయం సమృద్ధి, మెరుగైన రోడ్డు, రైలు మార్గాలు, మత్స్యకారుల ఆర్థిక శ్రేయస్సే లక్ష్యంగా విశాఖలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం అవ్వడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం  రాత్రి విశాఖ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఐఎన్ఎస్ డేగాలో ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం శోభాయాత్ర పేరుతో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ.. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని చోళా సూటులో బస చేయగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గోని శంకుస్ధాపనలు,ప్రారంభోత్సవాలను పూర్తి చేశారు.

 

 

 

భారీ బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ న్రెడ్డి, గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రమే వేదికపై ఆశీనులయ్యారు.మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చెయ్యగా , రెండో వేదికపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ముఖ్యం నాయకులు కలిపి 100 మందికి చోటు కల్పించారు. ఇంకో వేదిక వద్ద కేంద్ర, రాష్ట్ర అధికారులు 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 1,000 మందికి పైగా విఐపి పాసులు అందించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర వీఐపీలే కాకుండా.. సభకు హాజరైన ప్రజలు హాయిగా కూర్చునేలా వేదిక వద్ద ఏర్పాట్లు చేశారు. సరిగ్గా 10.10 నిమిషాలకు సభా వేదికకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ తో కలిసి ముందుగా రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నమూనాలను పరిశీలించారు. అనంతరం సభా వేదికపై ఆసీనులైన ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి జగన్ సన్మానించారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ప్రధాన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్లలో భారతీయ రైల్వే లో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. విశాఖ రైల్వే స్టేషన్ ను అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాసు స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు వందేభారత్ రైలు వస్తుందని తెలిపారు.

 

 

Post Midle

అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ విశాఖలో జనసముద్రం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశ ప్రగతి రథసారథి నరేంద్ర మోడీ అని అభివర్ణించారు. మూడున్నర ఏల్లుగా సంక్షేమం అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ప్రధాని మోడీకి వివరించారు. కేంద్రీకరణ, పారదర్శకతతో పాలన సాగిస్తున్నామని తెలిపారు. విభజన గాయం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదని, రాష్ట్రాన్ని కేంద్రం తగిన విధంగా ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తగిన విధంగా సహాయం అందించాలని కోరారు.అనంతరం కార్యక్రమంలో ప్రధాని మోడీ వర్చువల్ గా 460 కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, 3,778 కోట్లతో రాయ్ పూర్ – విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులు, 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు రహదారి నిర్మాణ పనులు,  152 కోట్ల రూపాయలతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, 2,658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగూల్, నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు నిర్మాణంకు శంకుస్థాపన చేశారు.  211 కోట్లతో పూర్తి చేసిన నరసన్నపేట – పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు, 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్ జీసీ – యూ ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ లను జాతికి అంకితం చేశారు.

 

 

 

అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ విశాఖపట్నం భారతదేశంలోనే ప్రత్యేకమైన ప్రముఖ నగరం అని అభివర్ణించారు. ప్రాచీన భారతదేశము యొక్క ప్రముఖ వాడరేవు విశాఖపట్నం అని అన్నారు. భారతదేశ వ్యాపార రంగానికి ముఖ్య కేంద్ర బిందువు విశాఖపట్నం అని పేర్కొన్నారు. రక్షణ, వ్యాపార పారిశ్రామిక రంగాల్లో విశాఖ ది కీలక పాత్రని అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఆంధ్ర ప్రజలు తమ ప్రతిభను కనబరుస్తున్నారని ప్రశంసించారు. ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. మిషన్ గతి శక్తి ద్వారా మౌలిక సదుపాయాల వేగం పెరుగుతోందని తెలియజేశారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ దిశగా విశాఖపట్నం కూడా అడుగు వేస్తుందన్నారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని తెలియజేశారు. సముద్ర వ్యాపారం పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.అనంతరం సభా వేదిక నుంచి మోదీ ప్రత్యేక విమానం ద్వారా తెలంగాణా పర్యటనకు పయణమయ్యారు.

 

Tags: Modi Sabha is successful

Post Midle