మరింత దూకుడు పెంచిన పార్టీలు

Date:20/11/2018
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అధికార, ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి. మిగతా పార్టీలతో పోలిస్తే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు మొండిచేయి చూపించారు. దీంతో ఈ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడప్పుడూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇక, ఆ పార్టీ అధినేత జగన్.. ప్రజాసంకల్పయాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రం దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈలోపే అతనిపై హత్యాయత్నం జరగడంతో వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. తాజాగా  యాత్రను ప్రారంభించారు. ఈ గ్యాప్‌లో జగన్ పలు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నందున ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్రలోనే వైసీపీ అభ్యర్ధులను ప్రకటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే, జగన్ దీనికి భిన్నంగా వ్యవహరించాడు. అభ్యర్ధులను ప్రకటించకపోగా.. వివిధ కారణాలతో నియోజకవర్గ సమన్వయకర్తలపై వేటు వేశాడు.ఇక పాదయాత్ర చివరి దశకు చేరుకోవడంతో పాటు, అప్పటి పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సర్వే నివేదికలను బట్టి అభ్యర్ధులను ప్రకటించబోతున్నాడని కొద్దిరోజుల క్రితం టాక్ వినిపించింది. వైసీపీ నేతలు కూడా ఇదే భావనలో ఉన్న సమయంలో జగన్ తన ప్లాన్‌ను మార్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా సర్వేలను పక్కన పెట్టి, ఆర్థిక బలం ఉన్న వారికే అధికంగా టికెట్లు కేటాయించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. మొన్నామధ్య గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామం, తాజాగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పంచాయతీలు అందులో భాగమేనని వినికిడి. తాజాగా, మరోసారి అలాంటి ఫార్ములానే అమలు చేశాడు.
తాడికొండ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం ఇన్‌చార్జిగా హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకుని వైద్య వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్‌ శ్రీదేవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు వైసీపీ అధినేత. ప్రస్తుత ఇన్‌చార్జిగా ఉన్న కత్తెర క్రిష్టియానాను తప్పించి శ్రీదేవికి బాధ్యతలు అప్పగించాడు. దీంతో క్రిష్టియానా వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. వైసీపీలోని కీలక నేతలు, జగన్ సన్నిహితులు మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలంటే ఇదే సరైన నిర్ణయం అని చెప్పుకుంటున్నారట.
Tags : More aggressive parties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *