మరింత దూకుడుగా రాజకీయ పార్టీలు

-భారీగా ప్రచారానికి వ్యూహాం
Date:17/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎన్నికల్లో ప్రచార హోరు పతాక స్ధాయికి చేరబోతుంది. రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కబోతున్నాయి. నామినేషన్ల పర్వం ముగియనుండటంతో  ప్రధానమైన రాజకీయ పక్షాలు ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాయి. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్దుల ఖరారు, నామినేషన్ల దాఖలు, మేనిఫెస్టోల విడుదల కార్యక్రమాలను ముగించుకొని జనం మధ్య తిరగడానికి అధినేతలు సిద్దమవుతున్నారు. టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మలివిడత ఎన్నికల ప్రచార షెద్యూల్‌ను విడుదల చేశారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిటెంట్ భట్టి విక్రమార్క కూడా తెలంగాణ అంతటా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. దేశ రాజకీయాల్లో హేమాహేమీలు తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పక్షాన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, బీజేపీ పక్షాన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షులు అమిత్‌షా, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు  ఎన్నికల ప్రచారంలో పాల్గొనేం దుకు రాజకీయ పార్టీలు రంగం సిద్దం చేసుకుంటున్నాయి.
టీఆర్‌ఎస్ – కాంగ్రెస్ పక్షాల మధ్య హోరా హోరీ ప్రచారం జరిగే అవకాశం ఉంది. కూటమిగా ఎన్నికల ప్రచారం జరుగుతుందో లేదో తెలియదు కాని కూటమి పక్షాల మధ్య ఓట్ల మార్పిడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూటమి పక్షాలు పేర్కొన్నాయి. టీఆర్‌ఎస్ ఇప్పటికే నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఉంది. అభ్యర్దులంతా నియోజక వర్గాలను చుట్టుముట్టుతున్నారు.  కేసీఆర్ దాదాపు 30 నియోజక వర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నందున పార్టీ శ్రేణులు సభలను విజయవంతం చేయడానికి చర్యలు చేపట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒకటి రెండు సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 19 నుండి 25 వరకు కేటీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా 25, 27, 28 తేదీల్లో ప్రచారం నిర్వహించనున్నారు. దాదాపు 12 నియోజక వర్గాల్లో అమిత్‌షా ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో బీజేపీ ఏర్పాటు చేసే ఎన్నికల సభల్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 23 తర్వాత సోనియాగాంధీ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్‌గాంధీ కూడా రెండు రోజుల పాటు తెలంగాణలో బహిరంగ సభలు, రోడ్‌షోలలో పాల్గొనే విధంగా ప్రచార కార్యక్రమం రూపొందుతుంది. ఈ నెల 19న ఖమ్మం, పాలేరు, పాలకుర్తి, 20న సిద్దిపేట, దుబ్బాక, హుజూరాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డి, 21న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్, 22న ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, ముథోల్, ఆర్మూర్, 23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ, 25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్, ఇబ్రహీంపట్టణం నియోజక వర్గాల పరిధిలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉంటుందని టీఆర్‌ఎస్ తెలిపింది. దాదాపు 30 నియోజక వర్గాల పరిధిలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉంటుందని తెలియచేశారు.
అన్ని ప్రధానమైన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నందున రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కబోతున్నాయి. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ ప్రసంగాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల  సభల్లో  టీడీపీ, కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పరిపాలన వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే విధంగా ప్రముఖుల ప్రసంగాలను సిద్దం చేస్తుందంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్‌షో నిర్వహించడంతో పాటుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తే అవకాశముందంటున్నారు. వివిధ రాజకీయ పక్షాల నుంచి స్టార్ క్యాంపెయినర్లు కూడా రంగంలోకి దిగబోతున్నారు. కాంగ్రెస్ పక్షాన ఇప్పటికే సినీనటి విజయశాంతి ఎన్నికల ప్రచారంలోకి దిగారు. నందమూరి బాల కృష్ణ టీడీపీ అభ్యర్దుల పక్షాన ఒక రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందకు మాటించారంటున్నారు. బీజేపీ తరపున కూడా పలువురు సినీ ప్రముఖులు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. కొంత మంది స్వామీజీలను కూడా ఎన్నికల ప్రచార బరిలోకి దించే ప్రయత్నం జరుగుతుంది.
టీజేఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ వివిధ నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచార సభల్లో పాల్గొనేందుకు ప్రత్యేక వాహనాన్ని సిద్దం చేసుకున్నారు. సీసీఐ అభ్యర్దుల విజయం కోసం పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఒకటి రెండు సభల్లో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. బీఎల్‌ఎఫ్‌తో పాటు సీపీఎం అభ్యర్ధుల విజయం కాంక్షిస్తు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ప్రచార సభల్లో పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. టీఆర్‌ఎస్ పక్షాన ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి చేస్తున్న ఎన్నికల ప్రచారం, అధికార పక్షంపై విసురుతున్న విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి. నామినేషన్ల గడువు ముగియడానికి మరో మూడు రోజుల గడువే ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. బొల్లం మల్లయ్యను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని కోదాడ టికెట్ ఇవ్వడం జరిగింది. మంచిర్యాలకు చెందిన గడ్డం రవీందర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.
వివిధ పార్టీల్లో టికెట్ రాని  అసమ్మతిదార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి సభ్యుల సంఖ్య సుమారు 40 వరకు ఉంటుందని మాజీ మంత్రి విజయరామారావు తెలిపారు. వీరంతా కలిసిన రెబెల్స్ ఫ్రంట్ కొత్తగా తెరపైకి రావడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పక్షాలు కొంత మేరకు రాజకీయంగా మూల్యం చెల్లించుకొనే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.
Tags; More aggressive political parties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *