టిటిడిలో మరింత పటిష్టంగా విద్యుత్ ఆదా చర్యలు -టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
టిటిడిలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల కార్యాలయంలో ఎపిఎస్ఇసిఎం(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్), నెడ్‌క్యాప్(నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఎపి) సంస్థల అధికారులతో గురువారం ఈవో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా అన్ని విభాగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఎపిఎస్ఇసిఎం సంస్థ టిటిడిలోని తాగునీటి పంపింగ్ స్టేషన్లలో గల 100 పాత పంపు సెట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయనుందన్నారు. ఇందుకయ్యే ఖర్చును సదరు సంస్థ భరిస్తుందని చెప్పారు. తద్వారా విద్యుత్ ఆదా అవుతుందన్నారు. అదేవిధంగా, నెడ్‌క్యాప్ సంస్థ ఆధ్వర్యంలో టిటిడిలో అన్నప్రసాదాల తయారీకి సోలార్ స్టీమ్ కుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ విధానం ద్వారా వంటగ్యాస్ ఆదా అవుతుందన్నారు. ఈ మేరకు సదరు సంస్థల అధికారులతో టిటిడి ఒప్పందం కుదుర్చుకుంది.ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎపిఎస్ఇసిఎం సిఈవో చంద్రశేఖర్‌రెడ్డి, నెడ్‌క్యాప్ జనరల్ మేనేజర్ జగదీశ్వర్‌రెడ్డి, ఏరియా మేనేజర్ ఆంజినేయులురెడ్డి, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, డిఇ రవిశంకర్‌రెడ్డి, వాటర్ వర్క్స్ ఇఇ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Tags:More robust power saving measures in TTD – TTD EO AV Dharma Reddy
